సర్పంచ్, ఆఫీసర్లపై తిరగబడ్డరు

సర్పంచ్, ఆఫీసర్లపై తిరగబడ్డరు

గద్వాల, వెలుగు: దిబ్బ గుంతల స్థలం విషయంలో సర్పంచ్, ఆఫీసర్లపై గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలం ఇర్కిచెడు గ్రామస్తులు శుక్రవారం తిరగబడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇర్కిచెడులో దళితులతోపాటు ఇతర కులస్తులు దాదాపు 60 కుటుంబాలవారు చాలా ఏండ్లుగా మసీదు దగ్గర ఉన్న 79, 80 సర్వే నంబర్లో దిబ్బ గుంతలు వేసుకొని స్థలాన్ని ఆధీనంలో పెట్టుకున్నారు. ఇటీవల పల్లె ప్రగతి కార్యక్రమంలో దిబ్బ గుంతలను క్లీన్ చేస్తామంటూ సర్పంచ్ మాధవి యజమానులకు నచ్చజెప్పారు. దిబ్బ గుంతలను క్లీన్ చేశాక వాటిలో రాళ్లు పాతి 48 ప్లాట్లు చేసి ఒక్కొటి రూ. రెండు లక్షల చొప్పున సర్పంచ్ అమ్మకానికి పెట్టినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఎంపీడీఓ, ఎంపీవో, సర్వేయర్ అక్కడకు వచ్చి సర్వే చేసేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. సర్పంచ్ తమను మోసం చేసిందని, ఆత్మహత్య చేసుకుంటామంటూ ఆఫీసర్ల ముందే పురుగుల మందు డబ్బాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. దీంతో సర్వే చేయకుండా ఆఫీసర్లు వెనక్కి వెళ్లిపోయారు. గ్రామ కంఠంలో ఆ స్థలం ఉందని, అంగన్​వాడీ బిల్డింగ్ లేదా ఇతర గవర్నమెంట్ అవసరాల కోసం వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్పంచ్​ చెప్పారు.