జనం అల్లాడుతుంటే రాజకీయాలా.. ? కేటీఆర్ పై కిషన్ రెడ్డి ఆగ్రహం

జనం అల్లాడుతుంటే రాజకీయాలా.. ? కేటీఆర్ పై కిషన్ రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: ‘‘రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు రాజకీయాలే కావాలి.. ఆయనను మాట్లాడుకోనివ్వండి.. కానీ వరదలతో జనం అల్లాడుతున్న ఈ టైంలో  మున్సిపల్ మంత్రిగా ఆయన రాజకీయాలు చేయడం సరైంది కాదు… గ్రేటర్​ హైదరాబాద్​లో గతంలో ఎప్పుడూ లేని రీతిలో వర్షాలు కురిసి, వరదలతో జనం అవస్థలు పడుతున్నారు… ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎవరైనా సరే…ఈ టైంలో రాజకీయాలు మాట్లాడడం వారి హోదాకు తగదు” అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. తనకు హైదరాబాద్ ప్రజల బాగోగులే ముఖ్యమని, వారిని ఆదుకోవడంపైనే దృష్టి పెడుతానని చెప్పారు. రాజకీయ రాద్ధాంతం చేయడానికి ఇది సరైన సమయం కాదన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని అన్ని రకాలుగా ఆదుకునేందుకు తన వంతు సహకారం అందిస్తానని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన సహాయ, సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. గ్రేటర్​ హైదరాబాద్​లో  రెండు మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునగడంతో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు కిషన్ రెడ్డి  బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. రాత్రి తన నియోజకవర్గం సికింద్రాబాద్​ పరిధిలోని  గాంధీ నగర్, దోమలగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్ పేట, కవాడిగూడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు. కిషన్​రెడ్డి వెంట బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా చైర్మన్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఉన్నారు. వరద ప్రాంతాలను ఆదుకునేందుకు హైదరాబాద్ పై బీజేపీ నేతలకు అంత ప్రేమ ఉంటే స్పెషల్ ప్యాకేజీ తీసుకురావాలని మంత్రి కేటీఆర్ అనడంపై కిషన్ రెడ్డి స్పందించారు. గ్రేటర్ తో పాటు గ్రామాల్లో కూడా జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇస్తే, కేంద్రం తరఫున అధికారులు పర్యటించి నష్టంపై అంచనా వేస్తారని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రానికి కేంద్రం   సాయం చేస్తుందన్నారు. అంతేకాని రాష్ట్రం ఎంత అడిగితే అంత ఇవ్వడం కుదరదని చెప్పారు.

బాధితులను బీజేపీ కార్యకర్తలు ఆదుకోవాలి -కిషన్ రెడ్డి

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ లోని వేలాది బస్తీలు, అపార్ట్ మెంట్ లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయని కిషన్​రెడ్డి అన్నారు. తాను ఢిల్లీలో ఉన్నా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశానని చెప్పారు. గ్రేటర్​లోని వరద పరిస్థితిని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వివరించానన్నారు. ఆయన ఆ దేశం మేరకు విజయనగరం నుంచి ఎన్డీఆర్ఎఫ్  టీమ్​లు, బోట్ లు గురువారం సిటీకి రానున్నాయని వివరించారు.  ఆర్మీ సాయమూ తీసుకుంటున్నామని, వరద ప్రాంతాల్లో సైన్యం సేవలందిస్తున్నదని చెప్పారు.  వరద బాధితులకు తాగునీరు, ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తానన్నారు. బీజేపీ కార్యకర్తలూ బస్తీల్లో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు శాశ్వతమైన ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్​ చేశారు.