పోలీస్ డ్రెస్​లో వచ్చి..తనిఖీల పేరుతో 18 లక్షలు తీసుకుని పరార్

పోలీస్ డ్రెస్​లో వచ్చి..తనిఖీల పేరుతో 18 లక్షలు తీసుకుని పరార్
  •     పంజాగుట్ట పీఎస్​లో బాధితుడి ఫిర్యాదు
  •     కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
  •      నిజంగానే చోరీ జరిగిందా అనే కోణంలో ఆరా?

హైదరాబాద్‌‌, వెలుగు : ఎన్నికల కోడ్ నేపథ్యంలో తనిఖీలను అవకాశంగా తీసుకున్న కొందరు వ్యక్తులు పోలీస్ డ్రెస్​లో వచ్చి వెహికల్ చెకింగ్ అని చెప్పి రూ.18 లక్షల 50 వేలను తీసుకుని పరారయ్యారు. ఈ ఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. బాధితుడి కంప్లయింట్​తో పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. నిజంగా చోరీ జరిగిందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై హరీశ్వర్‌‌‌‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బేగంబజార్‌‌కు చెందిన ప్రదీప్‌‌ శర్మ(30) ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు.  గురువారం రాత్రి 8.30 గంటలకు మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన చిమన్‌‌లాల్‌‌ సురేశ్‌‌ టెక్స్‌‌టైల్‌‌ ఉద్యోగి అక్షయ్‌‌ వద్ద రూ.20 లక్షలు తీసుకున్నాడు.

పంజాగుట్టలోని బ్యాంక్‌‌ ఆఫ్ బరోడాలో డిపాజిట్‌‌ చేసేందుకు కారులో బయలుదేరాడు. కారు డ్రైవర్ శంకర్‌‌‌‌తో కలిసి ట్రావెల్ చేస్తున్నాడు. బంజారాహిల్స్‌‌ రోడ్‌‌ నం.1లోని తాజ్‌‌కృష్ణ మీదుగా వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు పోలీస్‌‌ డ్రెస్​లో పెట్రోలింగ్‌‌ బైక్‌‌పై వచ్చారు. ప్రదీప్ శర్మ ప్రయాణిస్తున్న కారును అడ్డగించారు. ఆ వెంటనే ఇన్నోవా కారు అక్కడికి వచ్చింది. ప్రదీప్‌‌ను అడ్డగించిన వారు తాము పోలీసులమని చెప్పారు. వెహికల్ చెకింగ్  చేస్తున్నట్లు తెలిపారు. చెకింగ్‌‌లో రూ.20 లక్షలు ఉన్న బ్యాగ్‌‌ను గుర్తించారు. డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు.

ఆ తర్వాత తాము తీసుకొచ్చిన ఇన్నోవాలో కూర్చోబెట్టుకున్నారు. ఖైరతాబాద్‌‌ మెట్రో స్టేషన్‌‌ వద్ద కారును నిలిపివేశారు. ప్రదీప్ శర్మను కారు నుంచి కిందకు దించి బ్యాగ్​ను చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ప్రదీప్ శర్మ ఆ బ్యాగ్​ను తీసుకెళ్లి ఓనర్​కు ఇవ్వగా అందులో లక్షా 50 వేలు మాత్రమే ఉన్నాయి. నకిలీ పోలీసులే మిగతా డబ్బు కొట్టేసి ఉంటారని భావించిన ప్రదీప్ పంజాగుట్ట పీఎస్​లో కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరీశ్వర్ రెడ్డి తెలిపారు.