గోటబయ తీరుపై వెల్లువెత్తుతున్ననిరసన

గోటబయ తీరుపై వెల్లువెత్తుతున్ననిరసన

కొలంబో: ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ ఎక్కువైతోంది.. నిత్యావసరాలు దొరకక శ్రీలంకలో జనం రోడ్డెక్కుతున్నరు. పెట్రోల్, డీజిల్, మందుల కొరతతో అల్లాడుతున్నరు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఇంతటి సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదని చెప్తున్నరు. గతంలో ఎన్నడూ ఇలా ఆహారం, పెట్రోల్​ కోసం బంకుల ముందు బారులు తీరి, గంటల తరబడి నిల్చోవాల్సిన అవసరంరాలేదు. గతంలో తిరుగుబాటు సమయంలో కూడా వ్యక్తం కానంతటి తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కుటుంబ పాలన, అడ్డగోలు నిర్ణయాలతో దీనికి కారణమైన ప్రెసిడెంట్​ గోటబయ రాజపక్స, ఆయన కుటుంబంపై మండిపడుతున్నారు. గోటబయకు వ్యతిరేకంగా కొలంబో సహా పలు సిటీల్లో ఆందోళన చేస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలని, కుటుంబ సభ్యులను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్​ చేస్తున్నారు. ఈమేరకు శనివారం సెంట్రల్ కొలంబోలో పెద్ద సంఖ్యలో ప్రజలు జాతీయ జెండాలు, ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని ఆందోళన చేశారు. సోషల్​ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ నిరసనలో దాదాపు 10 లక్షల మంది పాల్గొన్నారు. ప్రధాన ప్రతిపక్షం సమాగి జన బలవెగయ(ఎస్​జేబీ) తర్వాతి పార్లమెంటు సమావేశాల్లో గోటబయ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్దమవుతోంది. 225 సీట్లున్న శ్రీలంక పార్లమెంటులో ఎస్ జేబీకి 54 మంది ఎంపీల బలం ఉంది. ప్రతిపక్ష సభ్యులు కూడా తమకు మద్దతిస్తారని ఎస్ జేబీ ధీమా వ్యక్తంచేస్తున్నది. 

సర్కారు తప్పులేదు..
దేశ ఆర్థిక పరిస్థితి తలకిందులవడంలో తమ ప్రభుత్వం తప్పేమీలేదని ప్రెసిడెంట్​ గోటబయ రాజపక్స సమర్థించుకున్నరు. ఫారెన్​ ఎక్స్చేంజ్​ సంక్షోభానికి తను కారణం కాదని స్పష్టం చేశారు. కరోనా కారణంగా టూరిజం దెబ్బతిని, ప్రభుత్వ ఆదాయం బాగా పడిపోయిందని గుర్తుచేశారు. కరోనా ఎఫెక్ట్​ నుంచి టూరిజం ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని  చెప్పారు. కొలంబోలో ప్రజల నిరసనల వెనక ప్రతిపక్షాల కుట్ర ఉందని గోటబయ ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం జనాలను రెచ్చగొట్టి, ఆందోళన చేయిస్తోందని ప్రతిపక్ష పార్టీ జేవీపీపై మండిపడ్డారు.

వడ్డీ రేట్లు పెంచిన సర్కారు
 దేశంలో నెలకొన్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో వడ్డీ రేట్లు పెంచుతూ శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తీసుకున్నది. సెంట్రల్ బ్యాంక్ కు చెందిన మానిటరీ బోర్డు 700 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 13.50 శాతానికి, స్టాండింగ్ లెండింగ్ ఫెసిలిటీ రేటు 14.50 శాతానికి చేరుకున్నది. ఈ వడ్డీ రేట్లు ఏప్రిల్ 8 నుంచే అమలులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా సరుకుల ధరలు పెరగడం, ఫారిన్ ఎక్స్చేంజ్​ రేటు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం మరింతగా పెరిగే అవకాశం ఉందని బోర్డు తెలిపింది. దీన్ని నియంత్రణలో పెట్టేందుకే వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు చెప్పింది. ఈ నెల 11న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్)తో చర్చలు జరిపేందుకు శ్రీలంక ప్రభుత్వం సిద్దపడుతోంది. చర్చలు సఫలం అయితే విదేశీ అప్పుల చెల్లింపులకు మరింత సమయం లభించే అవకాశం ఉంది. ఐఎంఎఫ్​తో చర్చల సమయంలో ఆర్థిక మంత్రికి సలహాలు ఇచ్చేందుకు నిపుణుల ప్యానల్​ను గోటబయ రాజపక్స ఏర్పాటు చేశారు.