ఓటుకు నోట్ల కోసం నిరసనల హోరు

ఓటుకు నోట్ల కోసం నిరసనల హోరు
  • హుజూరాబాద్ సెగ్మెంట్​​లో రెండోరోజూ రోడ్డెక్కిన ఓటర్లు
  • కొందరికిచ్చి తమకు ఇవ్వకపోవడం ఏమిటని నిలదీతలు
  • ఓటుకు రూ. 6 వేలు ఇచ్చేదాకా విడిచిపెట్టబోమని హెచ్చరికలు

 
ప్రత్యేక ప్రతినిధి / కమలాపూర్,  వెలుగు: హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటుకు నోట్ల కోసం నిరసనల హోరు నడుస్తున్నది. ఓ పార్టీ అభ్యర్థి తరఫున బుధవారం ఓటుకు రూ. ఆరు వేల చొప్పున లిపాపల్లో పెట్టి పంచగా.. ఆ డబ్బులు అందనివారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల ఎదుట, రోడ్ల మీద గురువారం నిరసనలకు దిగారు. తమకు పైసలు ఎందుకివ్వలేదని స్థానిక లీడర్లను నిలదీశారు. పైసలు ఇచ్చేదాకా విడిచిపెట్టేది లేదని ఆందోళనలకు దిగారు. తమకు పంచాలని ఇచ్చిన డబ్బులను లీడర్లు, సర్పంచ్​లు కాజేశారని వారు ఆరోపించారు. ‘‘మేము ఓట్లెయ్యనిదే టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చిందా? లిస్టులో పేర్లు ఉన్నా లీడర్లు ఎందుకు పంచుతలేరు” అని ప్రశ్నించారు. దీంతో పోలీసు సిబ్బంది, కేంద్ర బలగాలు రంగంలోకి దిగి వారిని శాంతింపజేశాయి. డబ్బుల కోసం ఓటర్లు ఆందోళనలకు దిగిన వీడియోలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మరోవైపు నియోజకవర్గంలో గురువారం కూడా డబ్బుల పంపిణీ కొనసాగింది.

ఆందోళనలతో రెండో విడత పంపిణీ
ఓటర్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడం, పైసలు ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తమవుతుండడంతో రెండో విడత డబ్బుల పంపిణీకి లీడర్లు   సిద్ధమైనట్లు తెలిసింది. ఇందులో భాగంగా కొన్ని గ్రామాల్లో డబ్బులు ఇవ్వని వారికి  గురువారం రాత్రి కవర్లలో పెట్టి అందజేసినట్లు సమాచారం. నాన్​ లోకల్ లీడర్ల తప్పిదంతో పాటు ముందస్తుగా తాము చేసిన సర్వేలో లోపాల వల్ల డబ్బులు  ఇవ్వలేక పోయామని, ఏమనుకోవద్దని వారు సర్దిచెప్పినట్లు తెలిసింది.  


ఓ పార్టీ తరఫున డబ్బుల పంపిణీ తీరుపై తొలుత బుధవారం రాత్రి హుజూరాబాద్ మండలం రంగాపూర్‌‌‌‌లో మొదలైన ఆందోళన గురువారం ఉదయం ఇతర గ్రామాలు, మండలాలకు వ్యాపించింది. హుజూరాబాద్ మండలంలో ఇప్పల నర్సింగాపూర్​, కాట్రపల్లి, రంగాపూర్​, పెద్ద పాపయ్యపల్లి, కందుగుల గ్రామాల్లో ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. పెద్దపాపయ్యపల్లిలో గ్రామ పంచాయతీ ఎదుట ఆందోళనకు దిగారు. వీణవంక మండలం గంగారంలో, ఇల్లందకుంట మండలం బూజునూరులోనూ ప్రజలు నిరసనలు చేశారు.  కమలాపూర్​ మండల కేంద్రంలోని 8, 9, 10 వార్డులకు చెందిన మహిళలు తమకు రూ. 6 వేలు  రాలేదంటూ రోడ్డెక్కి ఆందోళన చేశారు. సుమారు గంటన్నర  పాటు ఆందోళన చేసి మిగతావాళ్లకు ఇచ్చినట్లు తమకూ ఓటుకు రూ. ఆరు వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్​ చేశారు.  కొంత మందికే ఇచ్చే బదులు అందరికీ వెయ్యి రూపాయల చొప్పున అకౌంట్లలో వేస్తే సంతోషించే వాళ్లమన్నారు. ఎన్నికల ప్రచారానికి రమ్మని ఎవరు పిలిచినా వెళ్లామని, అట్లని ఏదో ఒక పార్టీ ముద్ర వేసి తమకు డబ్బులు ఇవ్వకపోవడం ఏమిటని వారు  మండిపడ్డారు.