గల్ఫ్ కార్మికులకు కుచ్చు టోపీ..

గల్ఫ్ కార్మికులకు కుచ్చు టోపీ..
  •  గల్ఫ్ కార్మికులకు కుచ్చు టోపీ
  • సౌదీలోని దమామ్‌‌‌‌లో కార్మికుల నుంచి రూ. 3.80 కోట్లు వసూలు
  • ఐదు రోజుల కింద ఇండియాకు వచ్చిన నిందితుడు
  • ఫోన్‌‌‌‌ స్విచాఫ్‌‌‌‌ రావడం, ఇంటికి తాళం వేసి ఉండడంతో ధర్నాకు దిగిన బాధితులు

బాల్కొండ, వెలుగు: తక్కువ కమీషన్‌‌‌‌ తీసుకొని హవాలా రూపంలో కుటుంబసభ్యులకు డబ్బులు పంపుతానంటూ గల్ఫ్‌‌‌‌ కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఓ వ్యక్తి ఐదు రోజులుగా కనిపించకుండా పోయాడు. డబ్బులు అందకపోవడంతో కార్మికుల కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. నిజామాబాద్‌‌‌‌ జిల్లా కమ్మర్‌‌‌‌పల్లి మండలం బషీరాబాద్‌‌‌‌కు చెందిన రాజు గౌడ్ పదేండ్ల నుంచి గల్ఫ్‌‌‌‌లోని దమామ్‌‌‌‌లో ఉంటున్నాడు. 

తక్కువ కమీషన్‌‌‌‌ తీసుకొని తెలుగు రాష్ట్రాల్లోని కార్మికుల ఫ్యామిలీలకు డబ్బులు ఇస్తానని గల్ఫ్‌‌‌‌లోని కార్మికులను నమ్మించాడు. దీంతో పలువురు కార్మికులకు రూ. 3.80 కోట్ల వరకు ఇచ్చారు. ఆ డబ్బులను తీసుకున్న రాజు గౌడ్‌‌‌‌ ఐదు రోజుల కింద ఇండియాకు వచ్చాడు. ఇక్కడ కార్మికుల కుటుంబ సభ్యులకు డబ్బులు ఇవ్వకపోవడంతో కొందరు ఫోన్‌‌‌‌ చేయగా స్విచాఫ్‌‌‌‌ వచ్చింది. 

శుక్రవారం బషీరాబాద్‌‌‌‌లోని రాజుగౌడ్‌‌‌‌ ఇంటికి రాగా తాళం వేసి కనిపించింది. దీంతో మోసపోయినట్లు గుర్తించి అక్కడే ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి బాధితులకు నచ్చజెప్పారు. బాధితుల ఫిర్యాదుతో రాజుగౌడ్‌‌‌‌ను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.