
- ఓపీ చార్జీల బాదుడు!
- హాస్పిటల్స్ వెళ్లేందుకు జంకుతున్న జనం
- దగ్గు, జలుబు, జ్వరాలకు సొంత వైద్యమే
- ఓపీ చార్జీలు పెరగడమే కారణం!
- డోలో, దగ్గు సిరప్‌లకు ఫుల్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: వర్షాలు, వాతావరణ మార్పులతో జనాలు జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ల బారినపడుతున్నారు. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈసారి చాలా మందిలో విపరీతమైన దగ్గు, ఒళ్లు నొప్పులు ఉంటున్నాయి. జ్వరం కంటే ఇవే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నయి. ఒక్కసారి వస్తే.. వారం, పది రోజుల దాకా వదలట్లేదు. అయినా, దవాఖాన్లకు వెళ్లేందుకు జనం ఇష్టపడటం లేదు. ఎప్పటిలాగే డోలో ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు. మే నెలతో పోలిస్తే ఈనెల తొలి 15 రోజుల్లోనే డోలో వినియోగం రెండింతలు పెరిగింది. డోలోకు తగ్గకపోతే ఫార్మసిస్టునో, అందుబాటులో ఉన్న ఆర్‌ఎంపీనో సంప్రదిస్తున్నారు. వాళ్లు సూచించిన మందులు వేసుకుంటున్నారు తప్ప.. హాస్పిటల్స్‌కు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. కోవిడ్ తర్వాత ఓపీ చార్జెస్ భారీగా పెరగడమే ఇందుకు కారణమై ఉండొచ్చునని డాక్టర్లు భావిస్తున్నారు. కోవిడ్ టైంలో మెడిసిన్ వినియోగంపై వచ్చిన అవగాహన కూడా కారణమై ఉండొచ్చునంటున్నారు. ఏదేమైనా తెలిసిన మందులన్నీ వినియోగించి, అప్పటికీ తగ్గకుండా ఇంకా సీరియస్‌గా ఉంటే తప్ప జనం తమ వద్దకు రావడం లేదని చెబుతున్నారు.
కన్సల్టేషన్ డబ్బుతోనే మందులు కొంటున్నరు..
కరోనా తర్వాత అన్ని హాస్పిటల్స్‌లో ఓపీ చార్జీలు భారీగా పెరిగాయి. కరోనాకు ముందు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో డాక్టర్ కన్సల్టేషన్ సగటున రూ.600 ఉంటే, ఇప్పుడు ఏకంగా వెయ్యికి చేరింది. ప్రైవేటు హాస్పిటల్స్‌లో రూ.600 నుంచి రూ.800 చార్జ్ చేస్తున్నారు. చిన్న హాస్పిటల్స్, క్లినిక్స్‌లో రూ.300 నుంచి 600 తీసుకుంటున్నారు. అదే డబ్బుతో సరిపడా మందులు కొనుక్కోవచ్చన్న ఆలోచనలో జనం ఉంటున్నారు. దవాఖానకు పోతే టెస్టులు చేయించుకోవాల్సి వస్తుందన్న భయం కూడా జనాల్లో కనిపిస్తున్నది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్లేట్‌లెట్స్ పేరిట ఏటా విపరీతమైన దోపిడీ జరుగుతున్నది. ఆయా జిల్లాల్లో ఈ భయం కూడా జనాలను హాస్పిటల్స్ వైపు వెళ్లకుండా వెనుకడుగు వేయిస్తోంది. కరోనా టైంలో ఉన్న పేషెంట్ లోడ్, అప్పటి పరిస్థితుల కారణంగా నర్సులు, ఇతర స్టాఫ్ జీతాలు పెంచాల్సి వచ్చిందని, ఇప్పుడు పేషెంట్ లోడ్ లేకపోయినా అవ్వే జీతాలు ఇవ్వాల్సి వస్తోందని డాక్టర్లు, హాస్పిటల్స్ యజమానులు చెబుతున్నారు. అందుకే ఓపీ, ఐపీ ఫీజులు పెంచాల్సి వచ్చిందంటున్నారు.
దగ్గు మందుకు ఫుల్ గిరాకీ
దగ్గు మందుకు గిరాకీ బాగా పెరిగింది. కొత్త కొత్త పేర్లతో కాఫ్ సిరప్‌లు అందుబాటులోకి వచ్చాయి. టీవీలు, సోషల్ మీడియాలో కాఫ్ సిరప్ యాడ్‌లు విపరీతంగా వస్తున్నయి. దీనికితోడు టానిక్ సీసా మీద ఎంఆర్‌పీ అడ్డగోలుగా ముద్రించి, ఫార్మసీ యజమానులకు సిరప్ తయారీ కంపెనీలు భారీ మార్జిన్ ఇస్తున్నాయి. దీంతో దగ్గు వస్తోందని చెప్పి మెడికల్ షాప్‌కు వెళ్లగానే, ఏదో ఒక సిరప్ తీసి చేతిలో పెడుతున్నారు. దగ్గు మందును డ్రగ్‌లా వినియోగిస్తున్నారన్న ఆరోపణలతో, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్మాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ.. ఫార్మసీలకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇష్టం వచ్చినట్టు అమ్మకాలు చేపడుతున్నారు. వాస్తవానికి, ఇప్పుడు వస్తున్న దగ్గు, జలుబుకు సిరప్ కంటే, ట్యాబ్లెట్స్ వాడటమే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ఒకవేళ సిరప్ వాడినా, డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలని సూచిస్తున్నారు.