Allu Arjun : రిషబ్ శెట్టి 'వన్ మ్యాన్ షో' అద్భుతం.. 'కాంతార: చాప్టర్‌ 1' చూస్తున్నంతసేపు ట్రాన్స్‌లోకి వెళ్లిపోయా !

Allu Arjun : రిషబ్ శెట్టి 'వన్ మ్యాన్ షో' అద్భుతం.. 'కాంతార: చాప్టర్‌ 1' చూస్తున్నంతసేపు ట్రాన్స్‌లోకి వెళ్లిపోయా !

కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్‌ శెట్టి సృష్టించిన 'కాంతార: చాప్టర్‌ 1' ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్‌ 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.   ఇండియన్ సినిమా చరిత్రలోనే ఈ ఏడాది అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 818 కోట్లకు పైగా భారీ వసూళ్లను రాబట్టింది.   ప్రస్తుతం ఈ సినిమా..  రూ. 1000 కోట్ల మార్కు దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం రూ. 105 కోట్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టించింది.

రిషబ్ శెట్టి 'వన్ మ్యాన్ షో' అద్భుతం

ఈ రికార్డుల పరంపర మధ్య.. ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ముంబైలో తన తదుపరి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, కాస్త తీరిక దొరకగానే ఈ సినిమాను వీక్షించారు. లేటెస్ట్ గా తన అనుభూతిని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నిన్న రాత్రి 'కాంతార: చాప్టర్‌ 1' చూశానని పేర్కొన్న అల్లు అర్జున్, ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని, చూస్తున్నంతసేపు తాను ఒక 'ట్రాన్స్‌లోకి వెళ్లిపోయానని' ట్వీట్‌ చేశారు. సినిమా రచన, దర్శకత్వం, నటన.. ఇలా ప్రతి విభాగంలో రిషబ్‌ శెట్టి చూపిన ప్రతిభను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. "రిషబ్‌ శెట్టి రైటర్‌గా, డైరెక్టర్‌గా, యాక్టర్‌గా 'వన్‌మ్యాన్‌ షో' చూపించారు. ఆయన ప్రతి క్రాఫ్ట్‌లో రాణించారు" అంటూ  బన్నీ కితాబిచ్చారు.

సాంకేతిక నిపుణులపై ప్రశంసలు

కేవలం రిషబ్‌ శెట్టినే కాకుండా, సినిమాలో అద్భుతంగా నటించిన రుక్మిణి వసంత్‌, జయరామ్‌, గుల్షన్‌ దేవయ్య తదితర నటీనటులను కూడా బన్నీ ప్రశంసించారు. ముఖ్యంగా, సాంకేతిక నిపుణుల పనితీరు అత్యద్భుతంగా ఉందని పేర్కొన్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం, అరవింద్‌ కశ్యప్‌ సినిమాటోగ్రఫీ, ధరణి ఆర్ట్ డైరెక్షన్, అరుణ్‌ రాజ్‌ స్టంట్స్‌ సినిమాకు ప్రాణం పోశాయని కొనియాడారు. ఇంత గొప్ప అనుభూతిని ఇచ్చినందుకు నిర్మాత విజయ్‌ కిరగందూర్‌, హోంబలే ఫిలిమ్స్‌ బృందానికి అభినందనలు తెలిపారు అల్లు అర్జున్.

చివరగా...  నిజాయతీగా చెప్పాలంటే, ఈ అనుభవాన్ని వివరించడానికి మాటలు సరిపోవడం లేదు. మీపై నాకు ఎంతో ప్రేమ, గౌరవం, అభిమానం ఉంది అంటూ అల్లు అర్జున్ తన ట్వీట్‌ను ముగించారు. ఐకాన్ స్టార్ నుంచి వచ్చిన ఈ ప్రశంసలు, 'కాంతార: చాప్టర్‌ 1' టీమ్‌కు మరింత ఉత్సాహాన్నిచ్చాయి.