జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో ఈసారి బ్యాలెట్ యూనిట్ లో అభ్యర్థుల కలర్ ఫోటో ఉంటుందన్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్.జూబ్లీహిల్స్ బై పోల్ పై మీడియా సమావేశం నిర్వహించిన ఆయన నియోజకవర్గ తుది ఓటర్ జాబితాను ప్రకటించారు . జూబ్లీహిల్స్ లో మొత్తం 4 లక్షల 13వందల 65 ఓటర్లు ఉన్నారని చెప్పారు. వీరిలో 2 లక్షల8 వేల 561 పురుష ఓటర్లు.. లక్షా 92వేల779 మహిళల ఓట్లు,25 ఇతరుల ఓట్లు ఉన్నాయని తెలిపారు.
ఓటర్ స్లిప్ ఐడెంటిటీ కాదన్నారు ఆర్వీ కర్ణన్. ఎలాంటి ఐడెంటిటీ ప్రూఫ్ తెచ్చినా ఓటు వేయొచ్చని చెప్పారు. పోలింగ్ స్టేషన్ లోనే సెల్ ఫోన్ కౌంటర్లు పెడతామని తెలిపారు. పొలిటికల్ పార్టీలు ఓటర్ స్లిప్పులు పంచితే కేసులు నమోదు చేస్తామన్నారు. బూత్ లెవల్ అధికారులు మాత్రమే ఓటర్ స్లిప్పులు పంచుతారని చెప్పారు.
మరో వైపు ఇవాళ్టితో (అక్టోబర్ 24) నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిపోగా.. జూబ్లీహిల్స్ బరిలో 58 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. సిట్టింగ్ సీటు దక్కించుకోవాలని బీఆర్ఎస్, జూబ్లీహిల్స్ లో గెలవాలని అధికార పార్టీ, సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ .. 14న కౌంటింగ్ జరగనుంది.
