
- దివ్యాంగులు పెన్షన్ దారులు మాత్రమే కాదు
- రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగదు
- బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్
ముషీరాబాద్, వెలుగు: దివ్యాంగులు క్రీడల్లో ప్రపంచ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వారిని కేవలం పెన్షన్ దారులుగా మాత్రమే చూడడం కరెక్ట్ కాదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ చెప్పారు. దివ్యాంగులను అందరితో సమానంగా చూడాలన్నారు. గురువారం విద్యానగర్లోని ఎస్ఆర్టీ హాల్లో బీజేపీ సిటీ ప్రధాన కార్యదర్శి సీకే శంకర్ రావు ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసరాలు, బట్టలు పంపిణీ చేశారు. చీఫ్ గెస్టుగా లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎంత చేసినా తక్కువే అన్నారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దివ్యాంగుల చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు. కానీ రాష్ట్రంలో ఆ చట్టాన్ని అమలు చేయకపోవడం దారుణం అన్నారు. ఫలితంగా లక్షలాది మంది నష్టపోతున్నారని చెప్పారు. ప్రత్యేకమైన శాఖ లేకపోవడంతో న్యాయం జరగడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిల భారత వికలాంగుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు, బీజేపీ సీనియర్ లీడర్లు కొత్తగుండ్ల రామారావు, డివిజన్ అధ్యక్షుడు నరేశ్, నాయకులు కౌడన్య ప్రసాద్, మంగళ, మాధవి, రమేశ్, చంద్రమోహన్, ఉపేందర్, శేషసాయి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.