గ్రేటర్ ‌‌ వరంగల్ ‌‌లో గుంతల రోడ్లు...స్లాబ్ లేని డ్రైనేజీలు

గ్రేటర్ ‌‌ వరంగల్ ‌‌లో గుంతల రోడ్లు...స్లాబ్ లేని డ్రైనేజీలు
  • పైప్ ‌‌లైన్ ‌‌ రిపేర్ల పేరుతో రోడ్లను తవ్వి వదిలేస్తున్రు

వరంగల్‍, వెలుగు : గ్రేటర్‍ వరంగల్ ‌‌ పరిధిలో మెయిన్ ‌‌ రోడ్లపై పడిన గుంతలు, తెరుచుకున్న మ్యాన్ ‌‌హోల్స్ ‌‌తో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ ‌‌ రోడ్లను ఆనుకునే పైకప్పులు లేని డ్రైనేజీలు ఉండగా, ప్రధాన రోడ్లపై ఎక్కడపడితే అక్కడ గుంతలు కనిపిస్తున్నాయి. దీంతో చిన్న పాటి వాన పడినా రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. మ్యాన్ ‌‌ హోల్స్ ‌‌ తెరిచి ఉండడం, కొన్ని చోట్ల డ్రైనేజీ స్లాబ్ ‌‌లు కూలిపోవడంతో వరద వచ్చినప్పుడు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మేయర్‍, ఎమ్మెల్యే ఇలాకాల్లోనే...

అమృత్ ‌‌ స్కీంలో భాగంగా చేపట్టిన మిషన్ ‌‌ భగీరథ పైపుల కోసం వరంగల్‍, హనుమకొండ, కాజీపేట పరిధిలో చాలాచోట్ల రోడ్లను తవ్వేశారు. ఇవేగాక వందలాది కాలనీల్లో పైప్ ‌‌లైన్ల లీకేజీ, రిపేర్ల పేరుతో తవ్వి వదిలేశారు. గ్రేటర్ మేయర్‍ గుండు సుధారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ ‌‌లోని రామన్నపేటలో పలుచోట్ల డ్రైనేజీ కోసం ఏడాదిన్నర క్రితం తవ్వి అలాగే వదిలేశారు. వరంగల్ ‌‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ‌‌ ఇంటి సమీపంలో వరంగల్‍ చౌరస్తా, శివనగర్‍, కరీమాబాద్ ‌‌ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు ప్రమాదకరంగా మారాయి. వరంగల్‍ చౌరస్తా, ఏనుమాముల, కాశీబుగ్గ, మండి బజార్ ‌‌ ప్రాంతాల్లో రోడ్డు వెడల్పు, డ్రైనేజీ నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. 

హనుమకొండ కొత్త బస్టాండ్‍, రెడ్డికాలనీ, యాదవనగర్‍, పోచమ్మకుంట, సమ్మయ్య నగర్‍, అంబేద్కర్ ‌‌ భవన్ ‌‌ రోడ్ ‌‌, గోపాల్‍పూర్‍, కిషన్ ‌‌పుర, నయీంనగర్‍, ఉనికిచర్ల రోడ్‍, కాజీపేట, సోమిడి, మడికొండలోని చాలాచోట్ల రోడ్లు, డ్రైనేజీ అధ్వానంగా మారాయి. క్లీనింగ్ ‌‌ పేరుతో నాలాలు, డ్రైనేజీపై స్లాబ్ ‌‌లను పగులగొడుతున్న మున్సిపల్ ‌‌ సిబ్బంది పని పూర్తైన తర్వాత వాటిపై స్లాబ్ ‌‌ వేయడం లేదు. దీంతో వరదలు వచ్చే టైంలో మ్యాన్ ‌‌హోళ్లు ఎక్కడ ఉన్నాయో కూడా కనిపించడం లేదు. 

డేంజర్‍ జోన్ ‌‌లో కేయూ 100 ఫీట్ల రోడ్డు

కేయూ 100 ఫీట్ల రోడ్డులో 2021లో చేపట్టిన డక్ట్ ‌‌ పనులు ఇంకా పూర్తి కాలేదు. పనులను అదే ఏడాది డిసెంబర్ ‌‌లోనే పూర్తి చేయాల్సి ఉన్నా ఆలస్యం అయింది. దీంతో గతేడాది వర్షాకాలం నాటికి పూర్తి చేస్తామని చెప్పినా ఇప్పటివరకు వరకు ఇంకా పూర్తి కాలేదు. ఆర్ ‌‌అండ్ ‌‌బీ, ఇరిగేషన్‍, మున్సిపల్ ‌‌ ఆఫీసర్ల మధ్య కో ఆర్డినేషన్ ‌‌ లేకపోవడం వల్లే పనులు ఆలస్యం అవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండే 100 రోడ్డు పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా తెలియడం లేదు. అలాగే ప్రెసిడెన్సీ స్కూల్‍ మీదుగా నయీంనగర్ ‌‌ వరకు ఉన్న నాలాకు ఇరువైపులా చేపట్టిన రిటైనింగ్ ‌‌ వాల్ ‌‌ పనులు రెండేళ్లయినా కనీసం అరకిలో మీటర్‍ కూడా పూర్తి కాలేదు.

రివ్యూలు, డెడ్‍లైన్లకే పరిమితం

వానాకాలంలో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాల్సిన పాలకమండలి రివ్యూలకే పరిమితం అవుతోంది. స్మార్ట్ ‌‌ సిటీలో భాగంగా చేపట్టిన పనుల్లో 39 రోడ్లు, డ్రైనేజీ వంటి పనులు పెండింగ్ ‌‌లో ఉన్నాయి. పనులన్నింటినీ జులై వరకు పూర్తి చేయాలని గ్రేటర్ ‌‌ కమిషనర్ ‌‌ రిజ్వాన్ ‌‌ బాషా కాంట్రాక్టర్లను ఆదేశించారు. అయితే పనులకు సంబంధించిన పెండింగ్‍ బిల్లులు ఇవ్వకపోవడంతోనే కాంట్రాక్టర్లు పనులు ఆపుతున్నారని తెలుస్తోంది.