గుంతల రోడ్లతో జనం ఇక్కట్లు

గుంతల రోడ్లతో జనం ఇక్కట్లు

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రోడ్లను వేసే వారు వేస్తున్నారు. తవ్వేవారు తవ్వుతున్నారు. ఆపై ఆ రోడ్డును పట్టించుకునే వారే కరువవుతున్నారు.  శ్రీనగర్‌ కాలనీ ప్రధాన రహదారిని మంచినీటి పైపులైన్‌ పనుల కోసం జలమండలి అధికారులు ఇటీవల  తవ్వారు.  పనులు పూర్తి చేశారు. అనంతరం మట్టితో పూడ్చి అలాగే వదిలేశారు. రోడ్డును మళ్లీ నిర్మించడం మరిచారు.  దీంతో ఆ దారిలో ప్రయాణించే వాహనదారులు దుమ్ముధూళి కళ్లల్లో పడి  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అమీర్‌పేట, పంజాగుట్ట ప్రాంతం నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ వైపు వెళ్లేందుకు  శ్రీనగర్​ కాలనీ రోడ్డే ప్రధాన రహదారి. దీంతో ఆ మార్గం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళ్లలో ట్రాఫిక్‌ సమస్యలు సైతం తలెత్తుతుంటాయి. అధికారుల నిర్వాకం వల్ల ఇప్పుడు రహదారి ఎగుడు దిగుడుగా తయారైంది. వాహనాలు వెళ్లేటప్పుడు దుమ్ము ధూళి పైకి లేచి కాలుష్యం సమస్య ఏర్పడుతోంది. వెనక వచ్చే వాహనదారుల కళ్లలో దుమ్ము పడటంతోపాటు వారు కాలుష్యపు గాలిని  పీల్చి ఇబ్బందులు పడుతున్నారు.  మంచినీటి పైపులైన్‌ పనుల కోసం ఇటీవల జలమండలి అధికారులు రోడ్డును తవ్వి పనులు పూర్తి చేశారు. అంతే అప్పటి నుంచి  అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని.. తిరిగి రోడ్డును నిర్మించే విషయం మర్చిపోయారని వాహనదారులు అంటున్నారు. అంతేగాక వాహనాలు వెళ్లడం వల్ల దుమ్ము, ధూళి రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాల్లోకి చేరుతోంది. నిత్యం దుమ్ము సమస్యతో తట్టుకోలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే రహదారిలోని కొన్ని మ్యాన్‌ హోల్స్‌ వద్ద తవ్విన అధికారులు వాటి పనులు సైతం పూర్తి చేయలేదు. రహదారి ఎగుడు దిగుడుగా ఉండటంతో వాహనాల వేగం మందగిస్తోంది. వాహనాలను చాలా నెమ్మదిగా జాగ్రత్తగా ముందుకు నడపాల్సి వస్తోంది. ద్విచక్ర వాహనదారులు ఒక్కోసారి కిందపడి గాయాల పాలవుతున్నారు. ఈ రోడ్డును తవ్వినప్పటి నుంచి కొందరు వాహనదారులు ఈ రహదారి గుండా రావడానికి జంకుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుని వెళ్లిపోతున్నారు. స్థానిక ప్రజలు, వాహనదారులు అధికారుల తీరుపట్ల ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.  వెంటనే బీటీ రోడ్‌ నిర్మించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.