
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి లక్షా 86 వేల 384 క్యూసెక్కులు వరద వస్తుండటంతో 18 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు లక్షా 86 వేల 384 క్యూసెక్కుల నీటిని వదులుతోన్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.40 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు..ప్రస్తుతం 310.5510 టీఎంసీలుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. సాగర్ గేట్లు ఎత్తటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను జాగ్రత్తగా ఉండాలని అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.
గత కొద్ది రోజులుగా ఎగువన కురుస్తోన్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఇప్పటికే జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు నిండుకుండలా మారగా.. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గేట్లు ఓపెన్ చేసి సాగర్‌కు నీటిని వదులుతున్నారు. సాగర్ గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లను ప్రత్యక్షంగా చూసి పులకించిపోయేందుకు పర్యాటకులు నాగర్జున సాగర్‌కు క్యూ కడుతున్నారు. పర్యాటకులతో సాగర్ ప్రాజెక్ట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. సాగర్‌లోని కొత్త బ్రిడ్జి, పవర్‌హౌస్, ప్రధాన డ్యాం క్రస్ట్ గేట్ల సమీపంలో, శివాలయం రోడ్‌లో సెల్ఫీలు దిగుతున్నారు