సామంతరాజులా కేసీఆర్​ పాలన: రేవంత్​

V6 Velugu Posted on Jan 27, 2022

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ పాలన సామంత రాజులా ఉందని పీసీసీ చీఫ్​, ఎంపీ రేవంత్​ రెడ్డి విమర్శించారు. ఉద్యమాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రంలో హక్కులను తొక్కేసి పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమకారులు, నిరుద్యోగులు, మేధావులు మళ్లీ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సమస్యలపై నేతలకు మొరపెట్టుకుందామన్నా.. సచివాలయం లేకుండా చేశారన్నారు. బుధవారం గాంధీభవన్​లో రిపబ్లిక్​ డే వేడుకల సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగరేశారు. ‘‘నేరెళ్లలో ఇసుక మాఫియాను ప్రశ్నించిన యువకులపై థర్డ్​ డిగ్రీ ప్రయోగించి దారుణంగా హింసించారు. గిట్టుబాటు ధర కావాలని ఖమ్మం మిర్చి రైతులు ఉద్యమిస్తే అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారు. భద్రాచలంలో ఆదివాసీ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు’’ అని రేవంత్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లు రావడం లేదని ఓ నిరుద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని, 317 జీవో రద్దు చేయాలని చాలా మంది టీచర్లు ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
ఫెడరల్​ స్ఫూర్తికి విరుద్ధంగా మోడీ పాలన
కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్​ హక్కులను కాలరాస్తూ పాలన చేస్తున్నారని.. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తేనే హక్కులకు రక్షణ అని రేవంత్​ అన్నారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తే ఓ కేంద్ర మంత్రి కొడుకు రైతుల మీదకు కార్​ ఎక్కించి చంపేశాడని, అయినా కూడా ఆ మంత్రిపై మోడీ ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోలేదని రేవంత్​ మండిపడ్డారు. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్​ ఆఫీసర్లను తన అధీనంలోకి తీస్కొని ఫెడరల్​ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పనిచేస్తోందని ఆరోపించారు. ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు తీసుకొచ్చిన కాంగ్రెస్​ను ప్రజలకు దూరం చేయడం బీజేపీ తరమా? అని సవాల్​ చేశారు. రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు ఇప్పటికే 17 లక్షలు దాటిందని, టార్గెట్ 30 లక్షలు కాగా, జోరు చూస్తుంటే 40 లక్షలు దాటేలా ఉందన్నారు.

 

 

 

Tagged Telangana, Congress, people, KCR, Rewanth Reddy, PCC, violation, rights, dictatorship

Latest Videos

Subscribe Now

More News