భద్రాచలానికి శాశ్వత వరద ముప్పు

 భద్రాచలానికి శాశ్వత వరద ముప్పు
  • పోలవరంతో భద్రాచలానికి  శాశ్వత వరద ముప్పు
  • ఎప్పటికీ మొదటి ప్రమాద హెచ్చరిక లెవల్‌‌లో నీటి మట్టం
  • ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక

హైదరాబాద్‌‌, వెలుగు : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి, ఫుల్‌‌ కెపాసిటీతో నీరు నిల్వచేస్తే  భద్రాచలానికి శాశ్వత వరద ముప్పు ఉంటుందని ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీ హెచ్చరించింది. ఈఎన్సీ నాగేందర్‌‌ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ వరద ముంపుపై మంగళవారం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. జలసౌధలో ఇరిగేషన్‌‌ స్పెషల్‌‌ సీఎస్‌‌ రజత్‌‌ కుమార్‌‌, ఈఎన్సీలు మురళీధర్‌‌, అనిల్‌‌ కుమార్‌‌తో కమిటీ సభ్యులు సమావేశమై నివేదికపై ప్రజంటేషన్‌‌ ఇచ్చారు. పోలవరం ఎఫ్‌‌ఆర్‌‌ఎల్‌‌ 50 మీటర్లు కాగా, ఆ స్థాయిలో నీటిని నిల్వ చేస్తే భద్రాచలం వద్ద 44 మీటర్ల (మొదటి ప్రమాద హెచ్చరిక 43 మీటర్లు) దాకా నీరు నిలిచి ఉంటాయని కమిటీ సభ్యులు తెలిపారు.

ఏటూరు నాగారం నుంచి భద్రాచలం వరకు గోదావరి నదిలో 50 వాగులు కలుస్తాయని, వాటి ప్రవాహం నదిలో కలవకుండా ఎగదన్నుతుందని చెప్పారు. ‘‘ఈ జులైలో భద్రాచలం వద్ద గోదావరిలో 24.34  లక్షల క్యూసెక్కుల వరద రావడంతో 102 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. నదికి కుడివైపు కరకట్ట లేకపోవడంతో బూర్గంపాడు పరిసరాల్లో వరద ముంపు ఎక్కువగా ఉందని గుర్తించాం. ఏపీలోని ఏటపాక వద్ద 5 కి.మీ. పొడవైన కరకట్ట నిర్మించాల్సి ఉంది. ఏపీలో కరకట్ట నిర్మించాలంటే ఆ రాష్ట్రం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.

గోదావరి వరదల నుంచి భద్రాచలం పరిసర ప్రాంతాలు ముంపునకు గురికాకుండా చేపట్టాల్సిన శాశ్వత, తాత్కాలిక చర్యలపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం” అని కమిటీ సభ్యులు తెలిపారు. గోదావరిలో వరద ప్రవాహం పూర్తిగా తగ్గిన తర్వాతే ఎలాంటి చర్యలు చేపడితే ముంపు నుంచి బయట పడవచ్చో సూచించగలమని వెల్లడించారు. పోలవరం బ్యాక్ వాటర్‌‌పై సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత సీడబ్ల్యూసీకి లేఖ రాయాలని నిర్ణయించారు.