కొత్త ఇండ్లకు పర్మిషన్లు ఇస్తలేరు

కొత్త ఇండ్లకు పర్మిషన్లు ఇస్తలేరు
  • ఊర్లలో ఇండ్లకు పర్మిషన్లు ఇస్తలేరు
  • కట్టుకుంటుంటే ఆపుతున్నరు
  • అనుమతులు ఇవ్వొద్దని సర్కారు నుంచి ఆదేశాలు!
  • ఎల్ఆర్ఎస్ అమలు చేసే ఆలోచనతోనే నిర్ణయం
  • ఫీజు వసూలు చేశాకే బిల్డింగ్​ పర్మిషన్లు!
  • రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో కొత్త వివాదాలు
  • విలేజ్​ సెక్రటరీలపై జనం ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఊర్లలో కొత్త ఇండ్లు కట్టుకునేందుకు పర్మిషన్లు ఇస్తలేరు. ఇప్పటికే పర్మిషన్ల కోసం పెట్టుకున్న అప్లికేషన్లనూ పెండింగ్​లో పెట్టేస్తున్నరు. ఇంకా ఎంతకాలం ఆగుతామనుకుంటూ ఎవరైనా ఇంటి పని మొదలుపెడితే.. పంచాయతీ ఆఫీసర్లు వచ్చి అడ్డుకుంటున్నరు. ఈ తీరుతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జనం ఇబ్బందిపడ్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అమలు చేస్తున్న టీఎస్  బీపాస్​ తరహాలో పంచాయతీల్లో కొత్త ఇండ్ల నిర్మాణాల కోసం పాలసీ తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని.. ఎల్ఆర్ఎస్​ను కూడా అమలు చేసే యోచనలో ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు. అందులో భాగంగానే ఊర్లలో కొత్త ఇండ్లకు పర్మిషన్లు ఇవ్వడం లేదని, ఈ మేరకు ఓరల్​ ఆర్డర్స్​ ఇచ్చినట్లు చెప్తున్నారు. మూడు నెలలుగా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కొత్త ఇండ్లకు అనుమతులను నిలిపివేశారు. అప్లికేషన్లు తీసుకోవడమే తప్ప వాటిపై ఏమీ రెస్పాన్స్​ ఇవ్వడం లేదు. దీంతో లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారు. గ్రామ పంచాయతీల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎవరైనా ధైర్యం చేసి ఇంటి పని మొదలుపెడ్తే విలేజ్ సెక్రటరీలు అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల శివారు గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి ఊర్లలో కొత్త ఇండ్ల నిర్మాణాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇప్పుడు పెద్ద సంఖ్యలో నిర్మాణాలు ఆగిపోయాయి.

ఊర్లలో కొత్త లొల్లి

కొత్త ఇండ్లకు పర్మిషన్లు ఇవ్వకపోవడంపై సర్కారు నుంచి ఎట్లాంటి అధికారిక ఆదేశాలు లేవు. దీంతో జనం విలేజ్ సెక్రటరీలను తప్పుపడుతున్నారు. రూల్స్​ ప్రకారం ఫీజులు కట్టించుకుని పర్మిషన్లు ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. పర్మిషన్లు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీస్తున్నారు. దీనికి విలేజ్​ సెక్రటరీలు సమాధానం చెప్పలేకపోతున్నారు. సర్కారే ఇవ్వొద్దన్నదని చెప్పినా.. ఆర్డర్స్​ ఏవి, చూపించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పలుచోట్ల ఊర్లలో గొడవలు తలెత్తుతున్నాయి. కొద్దినెలల కిందటి వరకు ఊర్లలో ఇండ్ల నిర్మాణాలకు ఈ–-పంచాయతీ పోర్టల్​ ద్వారా ఆన్ లైన్ లో పర్మిషన్లు ఇచ్చేవారు. కానీ మూడు నెలలుగా ఆ పోర్టల్ పనిచేయడం లేదని పంచాయతీ సెక్రటరీలు చెప్తున్నారు.

ఎల్ఆర్ఎస్ అమలుపై సర్కారు ఫోకస్

గత ఏడాది ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను రాష్ట్ర సర్కారు ప్రకటించింది. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయబోమని చెప్పింది. దాంతో సుమారు 26 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వాటిని క్లియర్ చేసి, ఫీజులు వసూలు చేయడం ద్వారా రూ.25 వేల కోట్ల దాకా ఇన్​కం వస్తదని సర్కారు అంచనా వేసుకుంది. కానీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడం, ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడం, అదే సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగలడంతో సర్కారు వెనక్కి తగ్గింది. పాత పద్ధతి ప్రకారం ఎల్ఆర్ఎస్ లేకుండానే ప్లాట్ల రిజిస్ట్రేషన్  చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే.. ప్లాట్ల రిజిస్ట్రేషన్​కు ఓకే చెప్పినా.. ఆ జాగాల్లో ఇండ్ల నిర్మాణాలకు మాత్రం పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఎల్ఆర్ఎస్​ ఫీజు కడితేనే బిల్డింగ్​ పర్మిషన్లు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఎంత మొత్తంలో ఫీజు వసూలు చేయాలనే దానిపై తుది నిర్ణయానికి రాలేదని అంటున్నాయి. దీనిపై విధాన పరమైన నిర్ణయం వచ్చే వరకు కొత్త ఇండ్లకు అనుమతులు ఇవ్వొద్దని మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయని చెప్తున్నాయి.

ఓపెన్  ప్లాట్లకు మ్యుటేషన్ ఫీజు

ఇప్పటివరకు కేవలం వ్యవసాయ భూములు, ఇండ్లకు మాత్రమే మ్యుటేషన్ ఫీజును వసూలు చేసేవారు. కానీ రాష్ట్ర సర్కారు రెండు నెలలుగా ఓపెన్ ప్లాట్లకు సైతం మ్యుటేషన్ ఫీజు వసూలు చేస్తోంది. సాధారణంగా ప్లాట్ ను మ్యుటేషన్ చేయించుకోవడం కోసం కొనుగోలుదారులు మున్సిపాల్టీ, గ్రామ పంచాయతీలకు వెళ్లరు. అలాగే పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు చెప్తున్న సర్కారు కొత్త రూల్స్ ను గుట్టుచప్పుడు కాకుండా అమలు చేస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓపెన్ ప్లాట్లకు రూ.3 వేలు, మున్సిపాల్టీ, గ్రామ పంచాయతీ పరిధిలోని ప్లాట్లకు రూ.1,000 ఫీజు వసూలు చేస్తోంది. దీంతో ప్రతి నెలా ప్రభుత్వానికి దాదాపు రూ. 15 కోట్ల ఆదాయం అదనంగా వస్తున్నట్టు రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెప్తున్నాయి.

ఎల్ఆర్ఎస్​ ప్రొసీడింగ్స్​ రావాలంటున్నరు

ఎల్ఆర్ఎస్  ఫీజు కడ్తామని చెప్పినా ఇంటికి పర్మిషన్ ఇవ్వడం లేదు. ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్​ రావాల్సి ఉంది అంటున్నరు. అవి ఎవరు ఇస్తరో, ఎప్పుడిస్తరో తెలియదు. పర్మిషన్లు ఎప్పుడిస్తరో విలేజ్ సెక్రటరీ చెప్పడం లేదు.

‑ సుభద్ర, మడికొండ, వరంగల్ అర్బన్ జిల్లా

చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న

ఎల్ఆర్ఎస్  కోసం అప్లయ్​ చేసుకున్న. ఎప్పుడు ఇస్తరా అన్ని ఇన్నాళ్లు ఎదురుచూసిన. ఇప్పుడు ఆ స్కీం రద్దయిందని ఇల్లు కట్టుకునే పర్మిషన్​ కోసం మా విలేజ్ సెక్రటరీకి అప్లై చేసుకున్న. కానీ పర్మిషన్​ ఇస్తలేరు.

– సత్యమూర్తి, చింతకుంట, కరీంనగర్ జిల్లా

For More News..

నేడే జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక