సిటీలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు న్యూ ఇయర్ ఈవెంట్లకు పర్మిషన్

సిటీలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు న్యూ ఇయర్ ఈవెంట్లకు పర్మిషన్

హైదరాబాద్, వెలుగు : సిటీ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 31న అర్ధరాత్రి 1 గంట వరకు న్యూ ఇయర్ ఈవెంట్లకు పర్మిషన్ ఉంటుందని  సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.  న్యూ ఇయర్ సెలబ్రేషన్లలో ఎలాంటి ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈవెంట్స్ నిర్వహించే ఆర్గనైజర్లు, పబ్స్, హోటల్స్, రిసార్ట్ నిర్వాహకులు 10 రోజులు ముందుగానే పర్మిషన్ తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన గైడ్​లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఈవెంట్లు జరిగే ప్రదేశాల్లో ఎంట్రీ,ఎగ్జిట్ పాయింట్స్, పార్కింగ్ ఏరియాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రికార్డింగ్ ఉండాలన్నారు.  అసభ్యకర డ్యాన్సులు చేయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. డీజే సౌండ్ 45 డెసిబుల్స్ మించొద్దని ఆయన సూచించారు. ఈవెంట్లకు పరిమితికి మించి పాస్​లు, టికెట్లు, కూపన్లు ఇవ్వొదని.. పబ్‌‌, బార్‌‌లలోకి మైనర్లను అనుమతించవద్దని ఆయన సూచించారు. న్యూ ఇయర్ ఈవెంట్లలో డ్రగ్స్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్

ఈ నెల 31న రాత్రి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ చేపడతామని సీపీ ఆనంద్ తెలిపారు. తాగి వెహికల్ నడిపితే రూ. 10 వేలు ఫైన్ లేదా 6 నెలల జైలు శిక్ష ఉంటుందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వెహికల్ సీజ్ చేస్తామన్నారు. ఓవర్ స్పీడ్‌‌, డేంజరస్ డ్రైవింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.