
భైంసా, వెలుగు: నాలుగు రోజులుగా నిర్మల్ జిల్లా భైంసా టౌన్లో ది కేరళ స్టోరీ సినిమా ప్రదర్శనపై కొనసాగుతున్న ఉత్కంఠకు సోమవారం తెరపడింది. ఎట్టకేలకు పోలీసు శాఖ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం నుంచి రోజు మార్నింగ్, మ్యాట్నీ షోలకు అనుమతినిచ్చింది. స్థానిక కమలా థియేటర్లో శుక్రవారం నుంచి రోజు నాలుగు ఆటలు నడవాల్సి ఉండగా... సమస్యాత్మక ప్రాంతమని పోలీసు శాఖ సినిమాను అడ్డుకుంది.
దీంతో హిందూవాహిని యువ, మహిళా విభాగాలతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు మంగళవారం నుంచి రెండు షోలకు అనుమతి ఇచ్చారు. ఉదయం, మధ్యాహ్నం మాత్రమే సినిమా ప్రదర్శించాలనే రూల్స్‌తో అనుమతి ఇచ్చినట్లు సీఐ ఎల్ శ్రీను తెలిపారు. థియేటర్ వద్ద పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు.