వెంట‌నే లిక్క‌ర్ షాపులు, రెస్టారెంట్లు ఓపెన్ చేయండి

వెంట‌నే లిక్క‌ర్ షాపులు, రెస్టారెంట్లు ఓపెన్ చేయండి

మ‌హారాష్ట్ర‌లో లిక్క‌ర్ షాపులు, రెస్టారెంట్లు ఓపెన్ చేసేందుకు వెంట‌నే అనుమ‌తించాల‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రేను కోరారు మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే. వీటి ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వానికి కొంత ఆదాయం వ‌స్తుంద‌ని చెబుతూ సీఎంకు లేఖ రాశారు. మార్చి 18 నుంచి రాష్ట్రం లాక్ డౌన్ లో ఉంద‌ని, ఇది ఎప్పటికి ముగుస్తుందో కూడా తెలియడం లేద‌ని అన్నారు. అన్నీ ప‌నులు నిలిచిపోవ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వానికి రావాల్సిన ఆదాయం దాదాపుగా జీరో అయిపోయింద‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో వైన్ షాపులు తెర‌వ‌డంలో త‌ప్పేలేద‌ని అభిప్రాయ‌డ్డారు రాజ్ థాక్రే. తాను ఈ సూచ‌న చేస్తోంది మ‌ద్యం ప్రియుల‌కు లిక్క‌ర్ అందుబాటులోకి తేవ‌డం కోసం కాద‌ని, ప్ర‌భుత్వానికి ఆదాయం వ‌చ్చే మార్గం కోస‌మ‌ని అన్నారు.

లిక్క‌ర్ అమ్మ‌కాల‌తో రూ.14 వేల కోట్ల ఆదాయం

ఒక్క లిక్క‌ర్ అమ్మ‌కాల ద్వారానే రాష్ట్ర ప్ర‌భుత్వానికి రోజూ రూ.41.66 కోట్లు ఆదాయం వ‌స్తుంద‌ని, నెల‌కు రూ.1250 కోట్లు, ఏడాదికి రూ.14 వేల కోట్ల రెవెన్యూ వ‌స్తుంద‌ని చెప్పారు రాజ్ థాక్రే. లాక్ డౌన్ కు ముందు రాష్ట్రంలో మ‌ద్యం నిషేధం అమ‌లులో ఏమీ లేద‌ని, ఇప్పుడు లిక్క‌ర్ షాపులు తెర‌వ‌డానికి నైతిక విలువ‌లు అడ్డుప‌డే స‌మ‌స్యేం లేద‌ని అన్నారు. లాక్ డౌన్ తో పూర్తిగా ఆదాయం కోల్పోయిన ఈ క్లిష్ట స‌మ‌యంలో వైన్ షాపులు తెర‌వ‌డంలో త‌ప్పేం లేద‌ని చెప్పారు. అలాగే ముంబై లాంటి న‌గ‌రాల్లో రెస్టారెంట్లు తెర‌వాల్సిన అవ‌స‌రం చాలా ఉంద‌ని అన్నారు. రియాలిటీలోకి వ‌చ్చి ఆలోచించాల‌ని, ఈ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించ‌డానికి మార్గాల‌ను వెత‌కాల‌ని సూచించారు రాజ్ థాక్రే. ఈ క‌ష్ట స‌మ‌యంలో ఆర్థికంగా రాష్ట్రం నిలదొక్కుకోవ‌డానికి సీరియ‌స్ గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారాయ‌న‌.