PSL 2024: 7 బంతుల్లో 5 వికెట్లు..గెలిచే మ్యాచ్‌లో ఓడిన ఇస్లామాబాద్

PSL 2024: 7 బంతుల్లో 5 వికెట్లు..గెలిచే మ్యాచ్‌లో ఓడిన ఇస్లామాబాద్

13 బంతుల్లో 21 పరుగులు చేయాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. క్రీజ్ లో అర్ధ సెంచరీలతో అజామ్ ఖాన్, మున్రో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ దశలో ఇస్లామాబాద్ ఓడిపోతుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. అయితే ఊహించని ఫలితమే వచ్చింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో భాగంగా 7 బంతుల్లో 5 వికెట్లు తీసి పెషావర్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 18 వ ఓవర్ చివరి బంతికి నవీన్ ఉల్ హక్.. అజామ్ ఖాన్ వికెట్ తీసుకోగా.. ఆ తర్వాత 19 ఓవర్లో యాకుబ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు.

తొలి బంతికి మున్రో, మూడో బంతికి హైదర్ అలీ వికెట్లు అవుట్ కాగా.. ఐదో బంతికి ఫహీన్ అష్రాఫ్, ఆరో బంతికి హుస్సేన్ షా పెవిలియన్ కు చేరారు. దీంతో విజయానికి 8 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఈ మ్యాచ్ లో అజామ్ ఖాన్ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టినా మ్యాచ్ ను గెలిపించలేకపోయాడు. కీలక దశలో ఒత్తిడి జయించలేక వరుసగా వికెట్లను కోల్పోయి పరాజయం పాలయ్యారు. మరోవైపు పెషావర్ తరపున బాబర్ అజామ్ సెంచరీ కొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ను గెలుచుకున్నాడు. 

మొదట బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. బాబర్ అజామ్ 63 బంతుల్లోనే 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 111 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో ఇస్లామాబాద్ 191 పరుగులకే పరిమితమైంది. అజామ్ ఖాన్ 30 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 75 పరుగులు చేశాడు. మున్రో 53 బంతుల్లో 71 పరుగులు చేశాడు. పెషావర్ బౌలింగ్ విషయాన్ని వస్తే యాకూబ్ 5 వికెట్లు పడగొట్టాడు.