మారటోరియంపై సుప్రీంకోర్టులో పిటిషన్

మారటోరియంపై సుప్రీంకోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ: లోన్​ ఈఎంఐలు, క్రెడిట్​ కార్డుల చెల్లింపులకు సంబంధించి ఆర్‌‌బీఐ విధించిన మూడు నెలల మారటోరియంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మారటోరియం కాలంలో ఏ బ్యాంక్, ఆర్థిక సంస్థలు అదనంగా వడ్డీ వేయకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్​ కోరారు. మార్చి 27న మారటోరియంపై ఆర్‌‌బీఐ జారీ చేసిన సర్క్యూలర్‌‌ అసంపూర్తిగా ఉందని, దానిని పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు. లాక్​ డౌన్​ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సాయం చేసేలా మారటోరియం కాలాన్ని మరింత పొడిగించేలా కేంద్ర ప్రభుత్వానికి, ఆర్‌‌బీఐకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అడ్వొకేట్ అమిత్ సాహ్ని ఈ పిటిషన్​ దాఖలు చేశారు. మారటోరియం కాలంలో ఈఎంఐలతోపాటు అదనంగా వడ్డీని చెల్లించాలని చెప్పడంలో అర్థం లేదన్నారు. కరోనా కారణంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని టర్మ్ లోన్ల ఈఎంఐలపై మూడు నెలల మారటోరియాన్ని ఇటీవల ఆర్​బీఐ ప్రకటించింది. మార్చి 1 నుంచి మే 31 వరకు ఈ మారటోరియాన్ని అమలు చేయాలని అన్ని బ్యాంక్‌లను ఆదేశించింది.