స్కూళ్ల రీఓపెన్ పై హైకోర్టులో పిటిషన్

స్కూళ్ల రీఓపెన్ పై హైకోర్టులో పిటిషన్
  • ప్రైమరీ, ప్రీ ప్రైమరీ ప్రత్యక్ష తరగతుల బోధన వద్దని కోరుతూ పిటిషన్

హైదరాబాద్: రాష్ట్రంలో స్కూళ్ల రీ ఓపెన్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి అంగన్ వాడి సహా  ప్రాథమిక, పూర్వ ప్రాథమిక పాఠశాలలన్నీ తెరవాలని, ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు స్కూళ్లలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శుభ్రత, ఏర్పాట్లు చేయాలని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. అయితే 8వ తరగతి కంటే దిగువ వారికి తరగతులు నిర్వహించే విషయంపై అభ్యంతరాలు వచ్చాయి. 
ఈ నేపధ్యంలో ప్రైవేటు టీచర్ బాలకృష్ణ ప్రత్యక్ష తరగతుల బోధనపై ఆందోళన వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  రాబోయే రోజుల్లో కరోనా మూడో దశ మొదలయ్యే సూచనలున్నాయన్న వైద్య నిపుణుల హెచ్చరికలను ప్రస్తావిస్తూ పిల్లలకు  ప్రత్యక్ష తరగతులు సరికాదని అభ్యంతరం తెలిపారు. సోషల్ డిస్టెన్స్, ఇతర నిబంధనలు పాటించడం చిన్న పిల్లల విషయంలో చాలా కష్టమని పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయాలని పిటిషన్ లో  కోరారు. హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ రామచంద్రరావు నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్ పై ఈనెల 31న విచారణ చేపట్టనుంది.