పెట్రోల్ కోసం యుద్ధం.. సిటీ మొత్తం క్యూలైన్ లోనే.. బంకుల వద్ద జాతర

పెట్రోల్ కోసం యుద్ధం.. సిటీ మొత్తం క్యూలైన్ లోనే.. బంకుల వద్ద జాతర
  •  అందరూ ట్యాంక్​ఫుల్లే
  • డబ్బాలు, క్యాన్లలోనూ పట్టుకుపోతున్నరు 
  • గంటల్లోనే ఖాళీ అవుతున్న స్టాక్
  • బంక్​ల వద్ద నో స్టాక్ బోర్డులు

హైదరాబాద్ సిటీ నెట్​వర్క్, వెలుగు: నగరం పెట్రోల్ ​బంకుల ఎదుట లైన్​ కట్టింది. గత 48 గంటలుగా ఏ పెట్రోల్​బంకులో చూసినా లైన్లు కట్టి ఫుల్​ట్యాంక్​పెట్రోల్​పోసుకుంటున్న వాహనదారులే కనిపిస్తున్నారు. బుధవారం బంకుల ఎదుట కిలోమీటర్ల మేర కార్లు, ఆటోలు లైన్​కట్టడంతో ట్రాఫిక్​కు ఇబ్బందులు కలిగాయి. దీంతో పలుచోట్ల ట్రాఫిక్​పోలీసులు రంగప్రవేశం చేసి క్రమబద్ధీకరించాల్సి వచ్చింది. బంకుల్లో రద్దీ పెరగడంతో పలు చోట్ల అవుటాఫ్​స్టాక్​బోర్డులు పెట్టారు.

పంజాగుట్ట, రాజ్​భవన్​రోడ్డు, బంజారాహిల్స్​రోడ్​నంబర్​10 లో పోలీసులు నిలబడి మరీ వాహనాలను బంకుల్లోకి పంపించారు. సివిల్​సప్లయీస్​ఆఫీసర్లు రంగంలోకి దిగి నో స్టాక్ బోర్డులు పెట్టిన బంకుల్లో తనిఖీలు నిర్వహించారు. అన్ని చోట్లా ఉదయం 6 గంటలకే బంకులకు ఆయిల్ ట్యాంకర్లు చేరుకున్నా రెండు మూడు గంటల్లోనే ఖాళీ అయ్యాయి.  

చాలా పెట్రోల్ బంకుల వద్ద రూల్స్ విరుద్ధంగా క్యాన్లు, బాటిల్స్ లో పెట్రోల్ పోసుకుంటున్నారు. దీన్ని చాలామంది బ్లాక్​మార్కెట్​లో అమ్ముకుంటున్నారని చెప్తున్నారు. అయితే, కొన్ని చోట్ల బాటిల్స్ లో పెట్రోల్ పోయకపోవడంతో గొడవలకు దిగుతున్నారు. 

ఆటోలు, క్యాబ్​చార్జీలు డబుల్​

పెట్రోల్​కొరతతో ఇదే అదునుగా పలువురు డ్రైవర్లు దండుకున్నారు. ఉదాహరణకు రాయదుర్గ్​నుంచి గచ్చిబౌలి టెలికామ్​నగర్​వరకు ఆటోలో రూ. 30 తీసుకుంటారు. కానీ, బుధవారం నుంచి దీన్ని రూ. 50 చేశారు. రాజేంద్రనగర్​కోర్టు నుంచి మెయిన్​రోడ్డుకు రోజు రూ. 30 తీసుకునేవారు. కానీ, బుధవారం దీన్ని రూ.50కి పెంచారు. క్యాబ్స్​కూడా అడ్డగోలుగా దండుకున్నాయి. ముషీరాబాద్​నుంచి అత్తాపూర్​వరకు ర్యాపిడోలో బైక్​కు రోజు రూ.90 నుంచి 100 అయ్యేది. కానీ బుధవారం రూ. ఏకంగా 180 వరకు తీసుకున్నారు. 

డిమాండ్ ​5 లక్షల లీటర్లు.. వచ్చేది 2 లక్షలు

నగరానికి రోజుకు 4 నుంచి 5 లక్షల లీటర్ల పెట్రోల్ డిమాండ్ ఉండగా మూడు రోజుల నుంచి 2లక్షల లీటర్లు మాత్రమే సరఫరా అవుతోందని పలువురు బంకుల నిర్వాహకులు చెబుతున్నారు. ఆయిల్ కంపెనీలు ఒకేసారి డబ్బులు చెల్లించి ఆయిల్ కొనాలని, క్రెడిట్ సౌకర్యం తొలగించడం వల్లే ఎక్కువ డీజిల్​, పెట్రోల్​కొనడం లేదంటున్నారు. పెట్రోల్, డీజిల్​అమ్మకాలు సాధారణ స్థితికి చేరాలంటే ఆయిల్ కంపెనీలు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డీలర్స్ కోరుతున్నారు. 

టైమ్​కు ఆఫీస్​కు చేరుకోలే: ముంబై హైవేపై మదీనగూడ వద్ద ఉన్న భారత్​ పెట్రోలియం, ఇండియన్​ ఆయిల్​ పెట్రోల్​బంకుల వద్ద  బైకులు, కార్లు, స్కూల్, కాలేజీ బస్సులు బారులు తీరాయి. దీంతో మియాపూర్​నుంచి చందానగర్​వైపు రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్​ స్తంభించింది.

మైండ్​ స్పేస్​ నుంచి బయోడైవర్సిటీ వెళ్లే రోడ్డులోని నాలెడ్జి సిటీ వద్ద ఉన్న ఇండియన్​ఆయిల్​పెట్రోల్​బంకుల వద్ద వాహనదారులు క్యూ కట్టడంతో టీ హబ్​ రోడ్డులో, మైండ్​స్పేస్​ నుంచి బయోడైవర్సిటీ రోడ్డులో ట్రాఫిక్​ జామ్ నెలకొంది. దీంతో ఐటీ ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్​లో చిక్కుకుని ఆఫీసులకు టైంకు చేరుకోలేకపోయారు.
  
 ఇక్కడ బాటిళ్లలో మాత్రమే పోస్తున్నరు: కుత్బుల్లాపూర్​లోని అన్ని పెట్రోల్​ పంపుల వద్ద రద్దీ కొనసాగింది. బహదూర్ పల్లి వద్ద ఉన్న ఓ పంపు నిర్వాహకులు వాహనదారులను బంక్​లోకి అనుమతించలేదు. కేవలం బాటి ల్స్​పట్టుకువచ్చిన వారికి మాత్రమే పెట్రోల్​ పోశారు. దీంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఎల్పీజీ, సీఎన్జీకి తిప్పలే: ఎల్పీజీ, సీఎన్జీ లేకపోవడంతో ఆటోలు కిలోమీటర్ల మేర రోడ్లపై బారులు తీరుతున్నాయి. లక్డీకాపూల్​లోని ఎల్పీజీ ఫిల్లింగ్​స్టేషన్​నుంచి మొదలుకుంటే కలెక్టరేట్, సంత్​నిరంకారి, ఇండియన్​పెట్రోల్​బంక్​ ఇలా చుట్టూరా క్యూ కనిపించింది. ఎర్రమంజిల్​లోని బంక్​నుంచి ఆటోలు లైన్​కట్టి పంజాగుట్ట వరకు బారులు తీరాయి.