మరో సారి పెట్రో షాక్: రాత్రి నుంచే ధరల పెంపు

మరో సారి పెట్రో షాక్: రాత్రి నుంచే ధరల పెంపు

బడ్జెట్‌‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన షాక్‌‌కు పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా జంప్ చేశాయి. శుక్రవారం రాత్రి నుంచే లీటరు పెట్రోల్ ధర మినిమమ్ రూ.2.40, లీటరు డీజిల్ ధర రూ.2.36 పెరిగింది. ఢిల్లీలో లీటరుకు రూ.2.45 పెరిగిన పెట్రోల్ ధర రూ.72.96కు చేరుకుంది. ముంబైలో కూడా ఇదే మాదిరి రూ.2.42 పెరిగి రూ.78.57గా నమోదైనట్టు ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్‌‌లో తెలిపింది. కోల్‌‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.2.40 పెరిగి రూ.75.15గా, చెన్నైలో రూ.2.57 ఎగిసి రూ.75.76గా నమోదైనట్టు వెల్లడైంది. డీజిల్ ధర కూడా ఢిల్లీలో లీటరుకు రూ.2.36 పెరిగింది. దీంతో అక్కడ డీజిల్ ధర రూ.66.69కు చేరుకుంది. ముంబైలో లీటరు డీజిల్ ధర రూ.2.50 ఎగిసి రూ.69.60గా ఉన్నట్టు ఐఓసీ నోటిఫికేషన్‌‌లో తెలిపింది.

రాజస్థాన్‌‌లో రూ.5 మేర పెరిగిన ధరలు

రాజస్థాన్‌‌లో అయితే ఏకంగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.5 మేర పెరిగాయి. పెట్రోల్‌‌పై వ్యాట్‌‌ రేటును 26 శాతం నుంచి 30 శాతానికి, డీజిల్‌‌పై వ్యాట్‌‌  రేటును 18 శాతం నుంచి 22 శాతానికి పెంచుతున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాజస్థాన్‌‌లో పెట్రోల్ ధర రూ.4.62 పెరిగినట్టు రాజస్తాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సునీత్ వెల్లడించారు.  జైపూర్‌‌‌‌లో అంతకుముందు లీటరు పెట్రోల్ ధర రూ.71.15 పలుకగా, ప్రస్తుతం రూ.75.77కు పెరిగింది. అదేవిధంగా డీజిల్ కూడా రూ.4.59 కాస్ట్‌‌లీ అయి రూ.71.24కు చేరుకుంది. రాజస్థాన్‌‌ బాటలోనే మధ్య ప్రదేశ్‌‌లో కూడా ఇంధన ధరలు శనివారం లీటరుకు రూ.4.5 పెరిగాయి. పెట్రోలియం ప్రొడక్ట్‌‌లపై  రెండు రూపాయలు అదనపు డ్యూటీని విధించడంతో అక్కడ కూడా ధరలు పెరిగిపోయాయి. కేంద్ర బడ్జెట్‌‌లో మధ్య ప్రదేశ్‌‌ షేరు రూ.2,677 కోట్లు తగ్గడంతో తాము అదనంగా ట్యాక్స్‌‌లు విధిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ రాష్ట్ర మంత్రి జితూ పట్వారి చెప్పారు. మరో నాలుగు రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతోన్న తరుణంలో, ఈ నష్టాలను పూరించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ వడ్డన తర్వాత పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌‌లతో పోలిస్తే మధ్య ప్రదేశ్‌‌లోనే లీటరు పెట్రోల్ ధర రూ.1.60, లీటరు డీజిల్ ధర రూ.5.40 కాస్ట్‌‌లీగా మారాయి.  హైదరాబాద్‌‌లో లీటరు పెట్రోల్ ధర రూ.77.48లకు చేరగా,లీటరు డీజిల్ ధర రూ.72.62గా నమోదయింది.

రాష్ట్రానికో రేటు..

స్థానిక సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్‌‌లు రాష్ట్రాలకు మధ్య భిన్నంగా ఉండటంతో పెట్రో ధరల్లో మార్పులు ఉన్నాయి.  . పెట్రోల్, డీజిల్‌‌పై ఎక్సైజ్ డ్యూటీని, రోడ్డు అండ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ సెస్‌‌ను లీటరుకు రెండు రూపాయల చొప్పున పెంచుతున్నట్టు శుక్రవారం బడ్జెట్‌‌లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో వార్షికంగా రూ.28 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని  చెప్పారు. పన్నుల పెంపుకు ముందు, పెట్రోల్‌‌పై మొత్తం ఎక్సైజ్ డ్యూటీ లీటరుకు రూ.17.98గా ఉండేది.  ప్రస్తుతం ఈ ట్యాక్స్ లీటరు రూ.19.98కు పెరిగింది. డీజిల్‌‌పై కూడా పన్ను పెంపుకు ముందు ఎక్సైజ్ డ్యూటీ లీటరుకు రూ.13.83గా ఉంది.  ఇప్పుడు డీజిల్‌‌పై కూడా ఎక్సైజ్ డ్యూటీ రూ.15.83కు పెరిగిది. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్‌‌పై ఎక్సైజ్ డ్యూటీ రెండుసార్లు మాత్రమే తగ్గించగా.. పది సార్లు పెంచింది.