60 రోజులకు సరిపడా స్టాక్ ఉంది.. బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ అమ్మితే యాక్షన్

60 రోజులకు సరిపడా స్టాక్ ఉంది.. బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ అమ్మితే యాక్షన్
  • జనం ఆందోళనతోనే అమ్మకాలు పెరిగాయ్​
  • సీపీ సజ్జనార్ వార్నింగ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ లో 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ ఉందని సీపీ వీసీ సజ్జనార్, కలెక్టర్​హరిచందన స్పష్టం చేశారు. బుధవారం టీజీసీసీసీలో అడిషనల్​సీపీ తప్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ శ్వేత, సివిల్ సప్లయీస్​అధికారులతో కలిసి సీపీ, కలెక్టర్​ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

సీపీ మాట్లాడుతూ  ప్రజలు ఒక్కసారిగా బంకులకు వచ్చి ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల డిమాండ్ పెరిగి,  కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు పెడుతున్నారన్నారు. దీన్ని కొరతగా భావించవద్దన్నారు. తప్పుడు ప్రచారంతో కమిషనరేట్ పరిధిలో 22న 3,024 కిలోలీటర్ల పెట్రోల్, డీజిల్ అమ్ముడవగా, 23న 6,400 కిలోలీటర్లకు చేరుకుందని సీపీ చెప్పారు.

జనం ఆందోళన చెందడం వల్లే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని తెలిపారు. బాటిల్స్, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ , డీజిల్ విక్రయిస్తే సీరియస్​యాక్షన్​ఉంటుందన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేసినా చర్యలు తప్పవన్నారు. 

కంట్రోల్​ రూమ్ ​ఏర్పాటు 

కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ కలెక్టరేట్‌‌‌‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే 040 –2320 2113 నంబర్‌‌‌‌కు కాల్ చేయవచ్చన్నారు.  జిల్లా పరిధిలోని 185 బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా సాగుతోందన్నారు.