ఆరో రోజూ పెట్రో షాక్

ఆరో రోజూ పెట్రో షాక్

సౌదీలోని ఆరామ్‌‌కో ఆయిల్‌‌ స్థావరాలపై డ్రోన్ అటాక్స్ జరగడం, అక్కడి ఉత్పత్తి తగ్గిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. వరుసగా ఆరో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గత ఆరు రోజుల నుంచి పెట్రోల్ ధర లీటరుకు రూ.1.59 పెరిగింది. డీజిల్ కూడా రూ.1.31 పెరిగినట్టు ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థల ధరల నోటిఫికేషన్‌‌లో వెల్లడైంది. ఆదివారం దేశ రాజధానిలో లీటరు పెట్రోల్ ధర 27 పైసలు పెరిగి రూ.73.62గా నమోదైంది. లీటరు డీజిల్ ధర 18 పైసలు ఎగిసి రూ.66.74గా పలికింది. హైదరాబాద్‌‌లో లీటరు పెట్రోల్‌‌ ధర రూ.78.23 కాగా, డీజిల్ లీటరు ధర రూ.72.73 పలికింది.

కొన్నేళ్ల వరకు ఆయిల్ మార్కెట్‌‌కు షాకే…

గత వారం సౌదీ అరేబియాలోని రెండు కీలక ఆయిల్ ఫెసిలిటీస్‌‌పై డ్రోన్ మిస్సైల్ అటాక్ జరిగింది. దీంతో గ్లోబల్‌‌గా ఆయిల్ ధరలు భగ్గమన్నాయి. ఆయిల్ సప్లయి కూడా తగ్గిపోయింది. అటాకర్స్ డ్రోన్ అటాక్ ద్వారా 5.7 మిలియన్ బ్యారల్స్ ప్రొడక్షన్‌‌పై లేదా సౌదీ అరేబియాలోని 60 శాతం ఉత్పత్తిపై దెబ్బకొట్టారు. చరిత్రలోనే ఇదే అతిపెద్ద సప్లయి అంతరాయం. సోమవారం బ్రెంట్ ఆయిల్ ఫ్యూచర్స్ 15 శాతం వరకు పెరిగాయి.  సౌదీ ఆరామ్‌‌కోకు చెందిన అబ్‌‌ఖ్వాయిక్‌‌, ఖురాయిస్‌‌ స్థావరాలపై జరిగిన అటాక్స్‌‌ ఆయిల్, గ్యాసోలైన్ ధరలకు పర్మినెంట్ రిస్క్‌‌ను కలుగజేస్తాయని అనలిస్ట్‌‌లు అంచనావేస్తున్నారు. ఈ అటాక్స్ కొన్నేళ్ల వరకు గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌‌కు షాకేనని నిపుణులంటున్నారు. సప్లయిను వెంటనే మళ్లీ పునరుద్ధరిస్తామని సౌదీ అరేబియా చెప్పింది. ఇండియా తన ఆయిల్ దిగుమతుల్లో ఐదో వంతు సౌదీ  అరేబియాపైనే ఆధారపడుతోంది. ఆయిల్ సప్లయి విషయాల్లో సౌదీ అరేబియా అధికారులతో ఇండియా ఎప్పటికప్పుడూ టచ్‌‌లో ఉంటూ.. పరిస్థితిని సమీక్షిస్తూ ఉంది.

నెలకు 20 లక్షల టన్నుల క్రూడ్‌‌ సౌదీ నుంచే…

ఇరాక్‌‌ తర్వాత ఇండియాకు రెండో అతిపెద్ద ఆయిల్ సప్లయిర్‌‌‌‌  సౌదీ అరేబియా. నెలకు 20 లక్షల టన్నుల క్రూడ్‌‌ను ఇండియాకు అమ్ముతుంది. దీనిలో సెప్టెంబర్‌‌‌‌ నెలకు సంబంధించి 12 లక్షల నుంచి 13 లక్షల వరకు క్రూడ్‌‌ను ఇప్పటికే ఇండియా తీసుకుంది.   డ్రోన్ అటాక్స్ జరగడంతో, సప్లయి విషయంలో ఎలాంటి అంతరాయం ఉండకుండా ఉండేందుకు సౌదీ అరేబియాతో ఇండియా ఎప్పటికప్పుడూ సంప్రదింపులు జరుపుతూ ఉంది. సౌదీ నుంచి ఏమైన సప్లయి తగ్గితే.. ఖతర్ నుంచి కొనుగోలు చేస్తామని ఐఓసీ ఛైర్మన్ సంజీవ్ సింగ్ చెప్పారు. ఇండియా సౌదీ అరేబియా నుంచి సుమారు రెండు లక్షల టన్నుల ఎల్‌‌పీజీని కూడా కొంటోంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఇండియా 40.33 మిలియన్ టన్నుల క్రూడాయిల్‌‌నుకొనుగోలు చేసింది.