పెట్రోల్ బంకుల కండిష‌న్: మాస్క్ లేకుంటే పెట్రోల్ పోసేదిలేదు

పెట్రోల్ బంకుల కండిష‌న్: మాస్క్ లేకుంటే పెట్రోల్ పోసేదిలేదు

దేశంలో క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాపిస్తున్న నేప‌థ్యంలో దాన్ని కంట్రోల్ చేసేందుకు అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇప్ప‌టికే వైర‌స్ క‌ట్ట‌డి కోసం లాక్ డౌన్ అమ‌లులో ఉన్న కొన్ని గంట‌ల పాటు నిత్యావ‌స‌రాల కోసం ప్ర‌జ‌ల‌కు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే వెసులుబాటు క‌ల్పించాయి. ఈ క్ర‌మంలో క‌రోనా బారిన‌ప‌డ‌కుండా మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తూ బ‌య‌ట‌కు వ‌స్తే మాస్క్ త‌ప్ప‌నిస‌రి చేశాయి ఒడిశా, తెలంగాణ స‌హా ప‌లు రాష్ట్రాలు.

ఈ నిబంధ‌న‌ను గ‌ట్టిగా పాటిస్తున్నాయి ప్రైవేటు సంస్థ‌లు కూడా. ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్ లోని పెట్రోల్ బంకుల్లో ఫిల్లింగ్ కోసం వ‌చ్చే వాళ్లకు మాస్కులు లేకుంటే ఫ్యూయ‌ల్ ప‌ట్ట‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు డీల‌ర్స్. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాపిస్తున్న నేప‌థ్యంలో పెట్రోల్ బంకుల్లో ప‌ని చేసే వ‌ర్క‌ర్స్ కూడా హీరోల‌ని అన్నారు ఉత్క‌ల్ పెట్రోలియం డీల‌ర్స్ అసోసియేష‌న్ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ సంజ‌య్ ల‌త్. ప్ర‌తి ఒక్క‌రూ మాస్కులు క‌ట్టుకోవ‌డం త‌మ వ‌ర్క‌ర్స్ తో పాటు క‌స్ట‌మ‌ర్ల‌కు కూడా మంచిద‌ని చెప్పారు. అందుకే మాస్కులు క‌ట్టుకుని వ‌చ్చిన వారికి మాత్ర‌మే పెట్రోల్, డీజిల్, సీఎన్జీ లేదా మ‌రే ఇంధ‌న‌మైనా ఫిల్ చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు.