హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాలుస్తున్నది. అనేక పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు నిండుకుంటున్నాయి. పలుచోట్ల ‘నో స్టాక్’ బోర్డులు పెట్టి బంకులను మూసివేస్తున్నారు. దీంతో పెట్రోల్ అందుబాటులో ఉన్న బంకుల వద్ద వాహనదారులు మంగళవారం కిలోమీటర్ల మేర బారులు తీరారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, అంబర్‌పేట, దిల్సుఖ్నగర్, మల్కాజిగిరి వంటి ప్రధాన ప్రాంతాల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఆయిల్ కంపెనీలు గతంలో ఇచ్చిన క్రెడిట్ సౌకర్యాన్ని రద్దు చేసి, ముందస్తుగా పూర్తి నగదు చెల్లిస్తేనే సరఫరా చేస్తామని నిబంధన పెట్టడమే ఈ సంక్షోభానికి కారణమని డీలర్లు చెప్తున్నారు. డిమాండ్‌కు సరిపడా నిధులు సమకూర్చుకోలేక తక్కువ పరిమాణంలోనే ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నామని, అది గంటల వ్యవధిలోనే అయిపోతోందని డీలర్స్ అసోసియేషన్ పేర్కొంది.
డబ్బాలు.. లేదంటే ట్యాంక్ ఫుల్
మరోవైపు, ఇంధన కొరత వార్తలతో ఆందోళన చెందిన వాహనదారులు ట్యాంక్ ఫుల్ చేయించుకోవడమే కాకుండా, వాటర్ క్యాన్లతో వచ్చి పెట్రోల్ తీసుకెళ్తుండటం రద్దీని మరింత పెంచుతోంది. ఇదే తరుణంలో మంగళవారం రాత్రి వర్షం కురవడం, ఇంధన కొరత తోడవడంతో క్యాబ్, ఆటో డ్రైవర్లు చార్జీలను రెట్టింపు చేసి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయిల్ కంపెనీలతో చర్చలు జరపాలని, లేనిపక్షంలో బంకులన్నీ మూసివేసి నిరసన తెలుపుతామని తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి అమరేందర్ రెడ్డి హెచ్చరించారు.
