గుడ్ న్యూస్.. ఒమిక్రాన్ పై పనిచేస్తున్న ఫైజర్ గోలి

గుడ్ న్యూస్.. ఒమిక్రాన్ పై పనిచేస్తున్న ఫైజర్ గోలి
  • ఆస్పత్రిలో చేరిక, చనిపోయే ముప్పు రెండూ తక్కువే
  • హై రిస్క్ గ్రూపులో ముప్పు 89% తగ్గుతది.. 
  • ఒమిక్రాన్​ వేరియంట్​పైనా పని చేస్తుందన్న ఫైజర్
  • టెస్టుల్లో 89% పనితనం చూపిందన్న ఫైజర్​
  • హైరిస్క్ గ్రూపులో ముప్పు బాగా తగ్గుతది
     

న్యూఢిల్లీ/వాషింగ్టన్: కరోనా ట్రీట్ మెంట్ కు తాము తయారు చేసిన యాంటీ వైరల్ డ్రగ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై కూడా బాగా పని చేస్తోందని అమెరికన్ కంపెనీ ఫైజర్ మంగళవారం ప్రకటించింది. మొత్తం 2,250 మందిపై ఈ మందు గోలీతో ట్రయల్స్ చేయగా, హై రిస్క్ ఉన్న పెద్ద వయసు వాళ్లలో 89 శాతం మందికి దవాఖాన్లలో చేరే అవసరాన్ని, చనిపోయే ప్రమాదాన్ని తగ్గించిందని వెల్లడించింది. కరోనా సింప్టమ్స్ కన్పించిన వెంటనే ఈ గోలి వేసుకున్నోళ్లలో రిజల్ట్ బాగా ఉన్నట్లు తమ స్టడీలో తేలిందని పేర్కొంది. చాలామంది నిపుణులు ఊహించినట్లుగానే ల్యాబ్​లో సపరేట్​గా నిర్వహించిన టెస్టుల్లో కూడా తమ యాంటీ వైరల్ డ్రగ్ కొత్త వేరియంట్ పైనా బాగా పనిచేస్తున్నట్లు కన్ఫామ్ అయిందని తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ రిప్రొడక్షన్ కోసం వాడుకునే కీలకమైన ప్రొటీన్ ను సింథటిక్ గా తయారు చేసి టెస్టు చేయగా ఈ మందు సమర్థంగా అడ్డుకున్నట్లు వివరించింది. 

త్వరలోనే ఎఫ్డీఏ ఆమోదం? 
కరోనా నిర్మూలనకు ఫైజర్​తో పాటు మెర్క్ కంపె నీ కూడా ట్యాబ్లెట్​ను తయారు చేసింది. ఈ రెండు కంపెనీలు ఇప్పటికే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అయితే హైరిస్క్ పేషెంట్లలో తమ యాంటీ వైరల్ డ్రగ్ 30% ముప్పును తగ్గిస్తుందని మెర్క్ ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండింటికీ ఆమోదం తెలపాలా? లేదా అన్న విషయంపై ఎఫ్డీఏ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్డీఏ ఆమోదం లభిస్తే.. కరోనాకు అనుమతి పొందిన ఫస్ట్ మందుగోలీలు ఇవే కానున్నాయి. కాగా, రెండు కంపెనీలూ తమ ట్యాబ్లెట్లతో టీకాలు వేసు కోని పెద్ద వయసు వాళ్లు, అస్తమా, ఒబెసిటీ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నోళ్లపై ట్రయల్స్ చేశాయి. 

దేశంలో మరో 17 మందికి ఒమిక్రాన్ 
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో మరో 17 మందికి సోకింది. మంగళవారం ఒక్క మహారాష్ట్రలోనే 8 కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, రాజస్తాన్ లలో 4 చొప్పున కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లోని సూరత్ లో మరో కేసు నమోదైంది. మహారాష్ట్రలోని 8 కొత్త కేసుల్లో 7 ముంబైలోనే వచ్చాయి. అయితే వీరిలో ఎవరికీ విదేశాలకు వెళ్లొచ్చిన హిస్టరీ లేకున్నా ఒమిక్రాన్ అంటుకుంది. వీరిలో ఒకరు బెంగళూరుకు, మరొకరు ఢిల్లీకి పోయొచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరంతా 24 నుంచి 41 ఏండ్ల మధ్య ఉన్నారని, ఇద్దరు మాత్రమే దవాఖాన్లలో చేరారని వెల్లడించారు. అయితే మహారాష్ట్రలో ఇప్పటివరకూ 9 మంది ఒమిక్రాన్ పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యారని, మరో 19 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. మంగళవారం నాటికి దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కు పెరిగింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 28, రాజస్తాన్ లో 13, ఢిల్లీలో 6, గుజరాత్ లో 4, కర్నాటకలో 3, కేరళ, ఏపీ, చండీగఢ్ లో 1 చొప్పున కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

ఒమిక్రాన్​తో దవాఖాన్ల చేరేటోళ్లు పెరగొచ్చు: డబ్ల్యూహెచ్ వో
జెనీవా: ఒమిక్రాన్ వ్యాప్తితో మున్ముందు దవాఖాన్లలో చేరేటోళ్ల సంఖ్య పెరగొచ్చని, దీనితో డెత్స్ కూడా ఎక్కువ కావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) అంచనా వేసింది. ‘ఆందోళనకర వేరియంట్’ లిస్టులో చేర్చిన ఒమిక్రాన్ తో ప్రపంచవ్యాప్తంగా కేసుల పెరుగుదలకు లింకు ఉందని వెల్లడించింది. అయితే ఒమిక్రాన్ పేషెంట్ల డేటాను మరింత అనలైజ్ చేసినంకే ముప్పు విషయం పూర్తిస్థాయిలో తెలుస్తుందని, ఇందుకోసం అన్ని దేశాలు దవాఖాన్లలో చేరిన పేషెంట్ల డేటా అందించాలని కోరింది. మరోవైపు ఒమిక్రాన్  ఇప్పటిదాకా 63 దేశాలకు వ్యాపించినట్లు ప్రకటించింది.

  • కొత్త కేసులు 5 వేలకు తగ్గినయ్
  • 88,993 కు తగ్గిన యాక్టివ్‌ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు, యాక్టివ్‌ కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 5,784 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 571 రోజుల తర్వాత ఇంత తక్కువగా కేసులు రికార్డవడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.47 కోట్లకుపైగా పెరిగినట్లు హెల్త్‌ మినిస్ట్రీ మంగళవారం వెల్లడించింది. అలాగే 563 రోజుల తర్వాత యాక్టివ్‌ కేసులు 88,993కు తగ్గినట్లు తెలిపింది. ఇది టోటల్‌ ఇన్‌ఫెక్షన్ రేటులో 0.26 శాతం అని పేర్కొంది. వైరస్‌తో మరో 252 మంది చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 4,75,888కు పెరిగినట్లు వెల్లడించింది. రికవరీ రేటు 98.37 శాతానికి పెరిగిందని చెప్పింది.