ఫేజ్ –1 ఇందిరమ్మ ఇండ్లు టార్గెట్ 2.50 లక్షలు .. సెప్టెంబర్ 17 నాటికి కంప్లీట్‌‌‌‌ కావాలి

ఫేజ్ –1 ఇందిరమ్మ ఇండ్లు టార్గెట్ 2.50 లక్షలు .. సెప్టెంబర్ 17 నాటికి కంప్లీట్‌‌‌‌ కావాలి
  • ఫేజ్‌‌‌‌–1 నిర్మాణాలపై అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం డెడ్‌‌‌‌లైన్‌‌‌‌
  • స్లాబ్‌‌‌‌లు పడ్డ ఇండ్లు ఆగస్టు 15లోపు కంప్లీట్‌‌‌‌ కావాలి
  • పూరిగుడిసెల సర్వేను వేగవంతం చేయాలని ఆదేశం
  • ఆసిఫాబాద్, ములుగు, కొత్తగూడెం, మెదక్..
  •  నాగర్ కర్నూల్‌‌‌‌ జిల్లాల్లో ఎక్కువ గుడిసెలున్నట్టు గుర్తింపు

నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పూర్తికి ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఫేజ్ –1 కింద మంజూరు చేసిన ఇండ్లలో 2.50 లక్షల ఇండ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలని హౌసింగ్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించింది.  గోడలు, స్లాబ్ వరకు చేరుకున్న ఇండ్లను ఆగస్ట్  15 నాటికే పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పూర్తికి ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఫేజ్ –1 కింద మంజూరు చేసిన ఇండ్లలో 2.50 లక్షల ఇండ్లను వచ్చే సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలని హౌసింగ్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ను ఆదేశించింది.  ఇందులో గోడలు, స్లాబ్ వరకు చేరుకున్న ఇండ్లను ఆగస్ట్  15 నాటికే పూర్తి చేయాలని స్పష్టం చేసింది.  మరో మూడున్నర నెలలు ఉండటంతో ఈ టార్గెట్‌‌‌‌ను పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 

ఈ అంశంపై ఇటీవల అన్ని జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్ల( పీడీ)తో కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ సమావేశం నిర్వహించారు. ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో డీఈ, ఏఈ, ఏఈఈలు విస్తృతంగా పర్యటించాలని, లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణం వేగంగా జరిగేలా అవగాహన కల్పించాలని సూచించారు.

లక్షన్నర ఇండ్లు పూర్తి

2025 ఫిబ్రవరిలో నారాయణ పేట జిల్లాలో తొలివిడత ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌‌‌ను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ప్రారంభించారు. అదే ఏడాది ఏప్రిల్1 నుంచి ఇండ్లను మంజూరు చేశారు.  ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లను కేటాయించారు. ఇప్పటివరకు ఫేజ్– 1 లో  3 లక్షల 24 వేల ఇండ్లను జిల్లా కలెక్టర్లు మంజూరు చేశారు.  ఇందులో 2 లక్షల 73 వేల ఇండ్ల పనులు స్టార్ట్ కాగా.. ఇప్పటికే లక్షకు పైగా ఇండ్లు స్లాబ్ పూర్తి  అయ్యాయి. 

 ఇందులో  మరో 50 వేల ఇండ్లు స్లాబ్ దశలో ఉన్నాయి. మరో మూడున్నర నెలలు టైమ్ ఉండటంతో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు లబ్ధిదారులకు దశలవారీగా ప్రభుత్వం రూ.7  వేల కోట్లను వారి ఖాతాలకు బదిలీ చేసింది.  వర్షాకాలం స్టార్ట్ అయినందున వ్యవసాయ పనులు, వర్షాలతో పనులు స్లో అవుతాయని అధికారులు భావించారు. అయితే, గత నెల రోజుల నుంచి వర్షాలు లేకపోవటంతో ఇండ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెబుతున్నారు.

రెండో విడత వేగంగా ఇండ్ల మంజూరు

ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌‌‌ను ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ప్రారంభించారు. రెండో దశలో నియోజకవర్గానికి 2,500 ఇండ్లను మంజూరు చేశారు. ఇందులో 500 ఇండ్లు పూరి గుడెసెలు ఉన్న వారికి ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది . 

పూరి గుడెసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.  పూరి గుడెసెలు ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చి రెండో దశలో వెంటనే  అర్హత ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు.  పూరి గుడెసెల్లో నివసిస్తున్న వాళ్లు రాష్ట్రవ్యాప్తంగా 73 వేల మంది ఉన్నట్టు ప్రజా పాలన అప్లికేషన్లలో వెల్లడైంది. ఇందులో  ఇప్పటి వరకు 37 వేల అప్లికేషన్లను అధికారులు సర్వే చేయగా 5 వేల మంది అర్హులుగా తేలారు. ఇందులో 615 మందికి జిల్లా  కలెక్టర్లు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారు. 

ఇక రాష్ట్రంలో  అత్యధికంగా పూరి గుడెసెల్లో నివసిస్తున్న పేదలు ఎక్కువగా  అసిఫాబాద్, ములుగు, కొత్తగూడెం, మెదక్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉన్నారని సర్వేల్లో వెల్లడైంది. తక్కువగా మేడ్చల్, రంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో ఉన్నారు. ఇక గోడలు వరకు కట్టుకుని రేకులు, పెంకుటింట్లో ఉంటున్న పేదలకు రూ. 2 లక్షలు ఇస్తామని రెండో దశలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేటగిరీలో  84 వేల మందిని అధికారులు గుర్తించి సర్వే చేస్తున్నారు.  ఇందులో అర్హులకు వెంటనే ఇండ్లను మంజూరు  చేస్తున్నారు.