PHC సిబ్బంది నిర్లక్ష్యం : శిశువు మృతి

PHC సిబ్బంది నిర్లక్ష్యం : శిశువు మృతి

నిజామాబాద్ : PHC సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందాడని, తమకు న్యాయం చేయాలని కోరుతూ కమ్మర్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు బాధితులు ఆందోళన నిర్వహించారు.కమ్మర్‌పల్లికి చెందిన మల్లంగారి రేణుక మూడో కాన్పు కోసం శుక్రవారం మధ్యాహ్నం కమ్మర్‌పల్లి PHCలో చేరింది. రేణుక తల్లి సౌందర్య తోడుగా వచ్చింది. విధుల్లో ఉన్న హెల్త్‌ సూపర్‌వైజర్‌ విజయలక్ష్మి, స్టాఫ్‌ నర్సు జ్యోతి కలిసి రేణుకను పరీక్షించారు. నార్మల్ డెలివరీ చేస్తామని, తల్లిబిడ్డను క్షేమంగా అప్పగిస్తామని చెప్పడంతో రేణుక తల్లి సౌందర్య డెలివరీకి అంగీకరించింది.

మధ్యాహ్నం 3 గంటలకు నార్మల్ డెలివరీలో రేణుక మగ శిశువుకు జన్మనిచ్చింది. కానీ శిశువులో కదలిక లేకపోవడంతో వెంటనే మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని వైద్య సిబ్బంది సూచించారు. శిశువును మెట్‌పల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఉమ్మినీరు మింగి చనిపోయాడని చెప్పారు డాక్టర్లు. చనిపోయిన శిశువుతో ఆసుపత్రికి చేరిన బాధితులు వైద్యసిబ్బందిని నిలదీశారు. రెండు కాన్పుల్లో సాధారణ ప్రసవం జరిగి ఆడపిల్లలు జన్మించారని, ఇప్పుడు వైద్యాధికారిణి లేకుండా సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రసవం చేయడంతోనే శిశువు చనిపోయాడని ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలిసిన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది PHC కి చేరుకొని.. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాత పూర్వక ఫిర్యాదుతో బాధితులు ఆందోళన విరమించారు.