వర్సిటీల్లో పీహెచ్ డీ, ఎంఫిల్ స్కాలర్లు డబుల్ 

వర్సిటీల్లో పీహెచ్ డీ, ఎంఫిల్ స్కాలర్లు డబుల్ 
  • రీసెర్చ్​లు పెరుగుతున్నయ్
  • వర్సిటీల్లో పీహెచ్ డీ, ఎంఫిల్ స్కాలర్లు డబుల్ 
  • 2019-20లో 6,110 మంది నమోదు
  • 1,345 మంది పీహెచ్ డీలు పూర్తి
  • ఏఎస్ హెచ్ఈ రిపోర్టు విడుదల

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పరిశోధనలు పెరుగుతున్నాయి. 2018–19తో పోలిస్తే 2019–20లో పీహెచ్ డీ, ఎంఫిల్ స్కాలర్ల సంఖ్య రెట్టింపు అయింది. యాన్యువల్ స్టేటస్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏఎస్ హెచ్ఈ) రిపోర్టును కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ (సీఐఐ) రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లోని పలు అంశాలను రిపోర్టులో పేర్కొన్నారు. తెలంగాణలో 24 వర్సిటీలు, 2,071 కాలేజీలుండగా, వీటిలో సుమారు13 లక్షల మంది చదువుతున్నారు. 2018–19 అకడమిక్ ఇయర్​లో పీహెచ్​డీ చేస్తున్న వాళ్లు 3,430 మంది ఉండగా, 2019–20 నాటికి ఆ సంఖ్య 5,508కి పెరిగింది. ఇందులో అమ్మాయిలు 2,001 మంది, అబ్బాయిలు 3,507 మంది ఉన్నారు. ఎంఫిల్​లో 2018–19లో 229 మంది చేరితే, 2019–20లో 373 మంది అడ్మిషన్లు పొందారు. వీరిలో అమ్మాయిలు170 మంది, అబ్బాయిలు 203 మంది ఉన్నారు. పీహెచ్ డీ, ఎంఫిల్ లో కలిపి మొత్తం 6,110 మంది ఉన్నారు. అయితే స్కాలర్స్​లో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ మంది అడ్మిషన్లు పొందుతున్నారు. ఇక 2019–20లో 450 మంది అమ్మాయిలు, 895 మంది అబ్బాయిలు పీహెచ్​డీ పూర్తిచేశారు.   

సర్కారు కాలేజీలకే మొగ్గు

రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీలతో పోలిస్తే సర్కారు కాలేజీల్లో చేరేందుకే మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం కాలేజీల్లో 80 శాతం ప్రైవేటువి ఉండగా, వాటిలో 76.8% మంది స్టూడెంట్లు చదువుతున్నారు. సర్కారు కాలేజీలు 14.3% ఉండగా, వాటిలో 16.7% మంది చదువుతున్నారు. యావరేజీగా ఒక్కో ప్రైవేటు కాలేజీలో 524 మంది చదివితే, సర్కారులో మాత్రం ఒక్కో కాలేజీలో 638 మంది చదువుతున్నారు. అయితే, సర్కారు విద్యాసంస్థల్లో అవసరానికి సరిపడా హాస్టళ్లు లేవని రిపోర్టులో పేర్కొన్నారు.