
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో సిట్ అధికారులు వేధిస్తున్నారని పిటిషన్ దాఖలు చేశారు. విచారణ పేరుతో తరుచూ పోలీస్ స్టేషన్కు పిలుస్తున్నారని వాపోయారు.
2025, ఆగస్టు 4వ తేదీన ప్రభాకర్ రావు పిటిషన్ విచారణకు రానున్నట్లు సమాచారం. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేయకుండా ప్రభాకర్ రావుకు కల్పించిన వెసులుబాటును కొట్టేయాలని ఇప్పటికే సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్.. ఈ కేసు నమోదు కాగానే విదేశాలకు పారిపోయాడు. పోలీసులు ఒత్తిడి, అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు రక్షణ కల్పించడంతో తిరిగి హైదరాబాద్ వచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు అవుతున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు ప్రభాకర్ రావును పలుమార్లు విచారించారు.
►ALSO READ | దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్
ప్రభాకర్ రావు దర్యాప్తుకు సహకరించడం లేదని.. ఆయనను అరెస్ట్ చేయకుండా కల్పించిన ఆదేశాలను కొట్టేయాలని సిట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఓ వైపు ఈ పిటిషన్పై విచారణ జరుగుతుండగానే.. మరోవైపు సిట్ అధికారులు విచారణ పేరుతో వేధిస్తున్నారని ప్రభాకర్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.