
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మేకల తిరుపతన్న హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును వాయిదా వేసింది. ఈ కేసులో దర్యాప్తు పూర్తయినందున బెయిల్ మంజూరు చేయాలంటూ తిరుపతన్న దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ జువ్వాడి శ్రీదేవి శనివారం విచారించారు.
పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ.. ‘‘కోర్టుకు సమర్పించిన కాల్‌డేటా ప్రకారం తిరుపతన్న ఎలాంటి నేరానికి పాల్పడలేదు. అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. అంటే దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు. తిరుపతన్న కేవలం ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేయడం తప్ప ఎలాంటి తప్పు చేయలేదు. ఇప్పటికే సమాచారం సేకరించినందున బెయిల్ మంజూరు చేయాలి” అని కోరారు.
దీనిపై పీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ‘‘లీడర్ల ఫోన్లను ట్యాపింగ్ చేసిన ఆరుగురు అధికారుల్లో తిరుపతన్న ఒకరు. స్పెషల్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు సూచనల మేరకు ఫోన్ ట్యాప్ పాల్పడ్డారు. పోయినేడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభాకర్‌రావుతో కలిసి ఆధారాలను ధ్వంసం చేశారు. కీలకమైన సమాచారాన్ని తగలబెట్టారు. అందువల్ల ఈ దశలో బెయిల్ ఇవ్వొద్దు” అని కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. తీర్పును వాయిదా వేశారు.