ఇవాళ(ఆగస్టు 8) సిట్ విచారణకు బండి సంజయ్

ఇవాళ(ఆగస్టు 8) సిట్ విచారణకు బండి సంజయ్

 

  • ఫోన్‌‌ ట్యాపింగ్​ కేసులో హాజరుకానున్న కేంద్రమంత్రి
  • కేసు పూర్వాపరాలపై కేంద్ర హోంశాఖ అధికారుల ఆరా.. హోంశాఖకు రిపోర్ట్?

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నేతలను విచారించిన సిట్‌‌.. వారి నుంచి వాంగ్మూలాలను సేకరించింది. అయితే, తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌‌ని సిట్‌‌ విచారించనున్నది. శుక్రవారం దిల్‌‌కుషా గెస్ట్​హౌస్‌‌లో సంజయ్​ విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో సిట్ ఎదుట హాజరవుతున్న తొలి కేంద్ర మంత్రి బండి సంజయే కావడంతో ఈ వ్యవహారంపై కేంద్ర నిఘావర్గాలు దృష్టి సారించాయి.


కేసు పూర్వాపరాలపై ఆరా తీసి.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు నివేదిక ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతున్నది.  సంజయ్​.. బంజారాహిల్స్‌‌‌‌లోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలు దేరి,10.30 గంటలకు ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ఉన్న హనుమాన్ టెంపుల్‌‌‌‌కు వెళ్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు రాజ్ భవన్ రోడ్డులోని దిల్‌‌‌‌కుషా గెస్ట్ హౌస్‌‌‌‌కు  చేరుకుంటారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీమ్ ఆయన వాంగ్మూలం రికార్డ్ చేయనున్నది. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

సిట్​సేకరించిన ఫోన్​నంబర్ల లిస్ట్‌‌‌‌లో  సంజయ్​ పేరు

2023 ఎన్నికలు, అంతకుముందు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో బీఆర్ఎస్​ పెద్దలు తన ఫోన్​ట్యాప్​చేయించారని బండి సంజయ్​పలుమార్లు ఆరోపించారు. అందుకు తగినట్లే సిట్​సేకరించిన ఫోన్​నంబర్ల లిస్టులో బండి సంజయ్​ పేరు ఉంది. దీంతో ఆయనను స్టేట్‌‌‌‌మెంట్​ ఇచ్చేందుకు రావాలని సిట్​ అధికారులు కోరారు. ఇది పలుమార్లు వాయిదా పడగా, శుక్రవారం ఖరారైంది. సిట్‌‌‌‌కు వాంగ్మూలం ఇచ్చిన అనంతరం బండి సంజయ్​ అక్కడే మీడియాతో మాట్లాడనున్నారు.  గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై బండి సంజయ్ మొదటి నుంచే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని జాతీయస్థాయి అంశంగా ఆయన పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కేంద్ర హోంశాఖకు కేసుకు సంబంధించిన  వివరాలను  వెల్లడించారు.   ఫోన్ ట్యాపింగ్‌‌‌‌కు సంబంధించి బండి సంజయ్ కేంద్ర నిఘా వర్గాల నుంచి పలు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. వాటిని కూడా సిట్‌‌‌‌కు అందించనున్నట్లు సమాచారం. మరోవైపు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని బీజేపీ లీగల్ సెల్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 

కేంద్ర నిఘా వర్గాల ఫోకస్ 

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరవుతున్న తొలి కేంద్ర మంత్రి బండి సంజయే కావడంతో ఈ వ్యవహారంపై కేంద్ర నిఘావర్గాలు దృష్టిసారించాయి.  సంజయ్​కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడంతో కేసుపై ఫోకస్​ పెట్టాయి. ఇప్పటికే కేసుకు సంబంధించిన వివరాలను సిట్​ద్వారా ఆరా తీసినట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్రహోం మంత్రిత్వశాఖకు నివేదిక కూడా అందించనున్నట్లు నిఘావర్గాలు చెప్తుండడం  ఆసక్తి రేపుతున్నది.