- ఎన్నికలు ఉన్నాయనే కేసీఆర్‌కు నోటీసులు : కవిత
- విచారణ త్వరగా పూర్తి చేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలున్నాయనే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఫోన్ట్యాపింగ్విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ఈ అంశంపై త్వరగా విచారణ పూర్తి చేసి కేసును ముగించాలని డిమాండ్ చేశారు. ఫోన్ట్యాపింగ్కచ్చితంగా బాధించే విషయమని, కానీ ప్రభుత్వ ఉద్దేశమేంటో ఎవరికీ అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
ఈ కేసులో నేరస్తులు పర్యవసానాలను ఎదుర్కొంటారా? లేదా? అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గురువారం ‘జాతీయ జనగణనలో కులగణన’ అంశంపై రౌండ్‌టేబుల్‌సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవిత మాట్లాడారు. ఆ తర్వాత కేసీఆర్‌కు సిట్నోటీసులివ్వడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.
ఓబీసీ కాలమ్ ఎక్కడ?
కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ, ఈబీసీలను ప్రత్యేకంగా లెక్కించాలని కవిత డిమాండ్‌చేశారు. సెన్సస్డాక్యుమెంట్లో ఓబీసీ కాలమ్‌ను కేంద్రం ఎందుకు పెట్టలేదని నిలదీశారు. ఆ డాక్యుమెంట్‌లో ఓబీసీ కేటగిరీ చేర్చేవరకూ ఉద్యమిస్తామన్నారు. ‘‘కులగణనపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. అన్ని కులాలనూ లెక్కిస్తామని కేంద్రం చెప్తే.. ఎంతో సంతోషపడ్డాం. కానీ సెన్సస్ డాక్యుమెంట్‌లో ‘అదర్స్’ అని మాత్రమే పెట్టి కుట్రకు తెరలేపింది. దీనివల్ల ఎంబీసీ, డీఎన్టీ, ఓబీసీ కులాలకు సర్టిఫికెట్లు రాని పరిస్థితి ఉంటుంది. కులగణన అంటే కులం కేటగిరీతో పాటు సబ్ కేటగిరీ కూడా ఉండాలి.
ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ రక్షణ ఉండడంతో వారికి అన్యాయం జరగడం లేదు. కానీ బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు రక్షణ లేకుండాపోయింది. దేశంలో 4 వేల కులాలు ఉన్నాయి. అదర్స్అని ఆప్షన్ పెడితే వారిని ఏ కులంగా భావించాలి. బీసీలను కేంద్రం మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నది” అని మండిపడ్డారు. ముందు రికగ్నైజేషన్.. ఆ తర్వాత రిజర్వేషన్అని తాము అంటున్నామని చెప్పారు. ఇంత టెక్నాలజీ వచ్చినా కులగణన చేయడం సాధ్యం కావడం లేదా? అని నిలదీశారు. మనం పోరాడితేనే ఓబీసీ, బీసీ, ఈబీసీ కాలమ్‌లను యాడ్ చేస్తారన్నారు.
దీనిని రాజకీయ ఎజెండాగా చేసుకున్నప్పుడే రాజకీయ పార్టీలు భయపడతాయన్నారు. మున్సిపల్, జడ్పీటీసీ ఎన్నికల్లో దీన్నే అజెండాగా చేర్చి ముందుకు వెళ్దామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్నాయకులు ఈ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై మాట్లాడకుండా పార్టీలు దాన్ని మర్చిపోయేలా చేస్తున్నాయని ఆరోపించారు.
