వైరల్ అవుతున్న ఫోటో.. నిజమెంత ?

వైరల్ అవుతున్న ఫోటో.. నిజమెంత ?
  • కరోనా కష్టాలపై పాత ఫోటోలతో గందరగోళం
  • తప్పులో కాలేస్తున్న ఎమ్మెల్యేలు,మంత్రులు

ఇదుగో తోక.. అంటే అదిగో పాము అన్నట్లుంది కరోనా సమయంలో వైరల్ అవుతున్న పాత ఫోటోల వ్యవహారం. క్షేత్ర స్థాయిలో భయాందోళన కలిగించే హృదయ విదారకమైన సంఘటనలు, దృశ్యాలు ఒకవైపు మనసులను కలచివేస్తుంటే.. ఘటనలతో ఏ సంబంధం లేని వారు.. తమకు తామే ఏదో ఊహించుకుని.. ఇంకేదో అన్వయించుకుని తెలిసీ తెలియక  ఇతరులకు షేర్ చేస్తుండడంతో మొదటికే మోసం వస్తోంది. వాస్తవాలు నిర్ధారితం కాకముందే.. భయంతోనో.. ఆతృతతోనే.. సామాన్యులు స్పందిస్తున్న తీరు.. అధికారులను, ఆమాత్యులను సైతం ఇబ్బందులపాలు చేస్తోంది. ఇదే కోవలోనే  పైన ఫీచర్ ఫోటో అందర్నీ తప్పులో కాలేసేలా చేస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ ప్రపంచ దేశాలతోపాటు.. మన దేశంలో కూడా విలయతాండవం చేస్తోందన్న వార్తలు భయాందోళన గొలుపుతున్న నేపధ్యంలో సోషల్ మీడియాలో ఎప్పటివో తెలియని ఫోటోలు హల్చల్ చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నాయి.. మరీ ముఖ్యంగా రెండు మూడేళ్ల క్రితం పాత ఫోటోలు కొన్ని షేర్ అవుతూ.. తెగ వైరల్ అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్, పంజాబ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ఆందోళనకలిగిస్తున్న విషయం తెలిసిందే. ఒక వైపు పాలకులు ఆక్సిజన్, వ్యాక్సిన్ల కొరత లేదని.. అనుమానం ఉన్న వారందరికీ కరోనా టెస్టులు చేస్తామని చెబుతుంటే.. కొన్ని చోట్ల దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాం. అయితే పాలకులకు వ్యతిరేకంగా ఈ ఘటనలను ఎత్తి చూపడంతో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులే కాదు... చివరకు వేగంలో పడి మీడియా ప్రతినిధులు సైతం తప్పులో కాలేస్తున్నారు. పైన చూస్తున్న ఫోటోలో ఆక్సిజన్ సిలిండర్ తగిలించుకుని ఓ వృద్ధురాలు రోడ్డుపైనే చికిత్స పొందుతున్నట్లు ఉంది. కరోనా కంటే ముందు రెండేళ్ల క్రితం నాటిది ఈ ఫోటో. అప్పటికి కరోనా ప్రబల లేదు. అయితే ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ ఫోటోను రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకు ప్రముఖంగా చూపిస్తూ.. పాలకులను ఎత్తి చూపించే ఉత్సాహంలో పడి రాజకీయ నేతలు, ప్రముఖులు సైతం ఫూల్ అవుతున్నారు.

తెలంగాణలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఈ ఫోటోను షేర్ చేయడంతో ఆ పార్టీ వారు చాలా మంది నిజమేననుకున్నారు. ఆయన ట్విట్టర్లో ప్రధాని మోడీని ప్రశ్నిస్తూ ఈ ఫోటోను జత చేశారు. ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వెంటనే లైక్ కొట్టడం.. షేర్ చేయడం చకచకా జరిగిపోయింది. కొద్ది సేపటికే ఇది ఫేక్ ఫోటో అని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఈ ఫోటో గురించి తెలిసీ తెలియక షేర్ చేస్తున్న జాబితాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఉండడం గమనార్హం. బీజేపీపైనా.. ప్రధాని మోడీపైనా ఒంటికాలితో లేస్తున్న ఆమె.. ఈ ఫోటోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేసి మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించిన ఫేస్ బుక్ పేజీ ‘‘ దీదీ కే బోలో’’  లో ఈ ఫోటోను ‘‘మోడీ రాజీనామా చెయ్’’ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టారు. ‘‘ క్యా యే ఆత్మీ నిర్భర్ భారత్ కా ఉదాహరణ్ హై’’ (ఇది ‘ఆత్మ నిర్భర్’ భారత్ కు ఉదాహరణ నా..?’’ అని ప్రశ్నించారు. ఇదే కోవలో.. ఈ ఫోటోను ప్రముఖ జర్నలిస్టు ఆరిఫ్ షా కూడా ట్విట్టర్ లో షేర్ చేసి తప్పులో కాలేశారు. ప్రస్తుతం భారతదేశంలో ఇదీ పరిస్థితి అని ఆయన ట్విట్టర్ లో రాసుకున్నారు. ఈయన ట్వీట్ ను 2500 మందికిపైగా లైక్ కొట్టగా.. మరో వెయ్యి మందికిపైగా షేర్ చేశారు.