హోలీ రోజు ఇక్కడ పిడిగుద్దులాట.. ప్రతి సంవత్సరం గ్రామ ఆనవాయితీ

హోలీ రోజు ఇక్కడ పిడిగుద్దులాట.. ప్రతి సంవత్సరం గ్రామ ఆనవాయితీ

హోలీ అంటే రంగులు చల్లుకుంటారు. పాటలకు, డప్పు వాయిద్యాలకు డ్యాన్ చేస్తారు. కానీ ఇక్కడ హోలీ రోజు సాయంత్రం అయిందంటే చాలు పిడిగుద్దులాట ఆడాల్సిందే.. ఇదే ఆ గ్రామ ఆచారం.. ఆనవాయితీ.. హోలీ వివిధ ప్రాంతాల్లో  వివిధ సంప్రదాయ ఆచారాలు, కట్టుబాట్ల పద్దతుల్లో జరుపుకుంటారు. మెదక్ జిల్లా  శివ్వంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామంలో వందల సంవత్సరాల నుండి పిడిగుద్దులాట ఆనవాయితీగా  వస్తుంది. ఉదయం హోలీ జరుపుకోని సాయంత్రం గ్రామపంచాయతీ వద్ద నుండి గ్రామస్తులు ఊరేగింపుగా  వెళ్లి కల్లు ఘటం తీసుకొని ఆంజనేయ స్వామి ఆలయం ముందు పెడతారు. అక్కడి నుండి కులవృత్తుల వారి ఇంటికి వెళ్లి ఓ పెద్ద తాడును తీసుకొని వచ్చి ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు జరిపించి పిడి గుద్దుల ఆట ఆడారు. బోదాన్ సమీపంలో సాలూరా మండలం హూస్నా గ్రామంలో కూడా ఈ పిడిగుద్దులాట హోలీ రోజు సాయంత్రం ఆడటం ఆనవాయితీ...

అసలు ఏం జరుగుతుంది?
హోలీ రోజు గ్రామంలోని చావిడి దగ్గర గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోతారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం గ్రామంలో కులపెద్దలను డప్పు వాయిద్యాలతో చావిడి దగ్గరకు తీసుకొస్తారు. చావిడి వద్ద రెండు వైపుల బలమైన కట్టెలు పాతి, వాటి  మధ్య తాడు కడతారు. గ్రామస్థులు రెండు వర్గాలుగా విడిపోయి తాడును మధ్యలో పట్టుకొని ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపిస్తారు. ఇలా 15 నుంచి 30 నిమిషాల పాటు ఈ ఆట సాగుతుంది. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు.