మనుషుల వెంట్రుకలతో.. పావురాల కాళ్లు పోతున్నయ్‌‌‌‌

మనుషుల వెంట్రుకలతో..  పావురాల కాళ్లు పోతున్నయ్‌‌‌‌

మీకు దగ్గర్లో పావురాలు కనిపిస్తుంటాయా? అయితే ఓసారి కాస్త దగ్గరికెళ్లి వాటి కాళ్లను చూడండి. దెబ్బలు తగిలో, కట్‌‌‌‌ అయిపోయో, కాలే లేకుండానో కనిపించాయా? ఇలా జరగడానికి కారణమేంటనుకుంటున్నారు? మనుషుల వెంట్రుకలు. వాటి వల్లే పావురాల కాళ్లు తెగిపోవడం, దెబ్బలు తగలడం జరుగుతోందట. ఇంతకుముందు వరకు దీనికి కారణం ఇన్‌‌‌‌ఫెక్షనో లేక కెమికల్‌‌‌‌ పొల్యూషనో అని సైంటిస్టులు అనుకున్నారు. కానీ తాజాగా ఫ్రెంచ్‌‌‌‌ రీసెర్చర్లు మాత్రం మనుషుల వెంట్రుకల వల్లే ఇదంతా జరుగుతోందని తేల్చారు. పావురాలకు దగ్గరుండే హెయిర్‌‌‌‌ డ్రెస్సర్‌‌‌‌ సెలూన్ల నుంచి వచ్చే వేస్ట్‌‌‌‌ వెంట్రుకలు వాటి కాళ్లకు చుట్టుకొని దెబ్బలు తగలడమో, ఒక్కోసారి పూర్తిగా కాలే తెగిపోవడమో జరుగుతోందని చెబుతున్నారు.

నేషనల్‌‌‌‌ మ్యూజియం ఆఫ్‌‌‌‌ న్యాచురల్‌‌‌‌ హిస్టరీ, యూనివర్సిటీ ఆఫ్‌‌‌‌ లియాన్‌‌‌‌కు చెందిన రీసెర్చర్లు పారిస్‌‌‌‌లోని సుమారు 46 ప్రాంతాల్లో పరిశోధనలు చేసి ఈ విషయం తెలుసుకున్నారు. పావురాల కాళ్లు తెగిపోవడానికి వెంట్రుకలతో పాటు ఇతర రకాల హ్యూమన్‌‌‌‌ పొల్యూషనే కారణమని గుర్తించారు. ఎక్కువ హెయిర్‌‌‌‌ డ్రెస్సర్‌‌‌‌లున్న ప్రాంతాల్లో చాలా పావురాలకు దెబ్బలు తగిలాయన్నారు. ఇలా కాళ్లకు వెంట్రుకలు చుట్టుకొని తెగిపోవడానికి ‘స్ట్రింగ్‌‌‌‌ఫీట్‌‌‌‌’గా సైంటిస్టులు పేరు పెట్టారు. ఎక్కువ గాలి, శబ్ద కాలుష్యమున్న ప్రాంతాల్లో ఈ పావురాలు తక్కువుంటాయి. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లోనే ఉండేందుకు ఇష్టపడుతుంటాయి. పచ్చదనం ఎక్కువుంటే పక్షులు ఆనందంగా బతికేస్తాయి.

Pigeons could be losing their toes because of human hair