అసైన్డ్ భూముల చట్టంపై హైకోర్టులో పిల్

అసైన్డ్ భూముల చట్టంపై  హైకోర్టులో పిల్
  • చట్ట సవరణను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన తెలంగాణ రిపబ్లికన్ పార్టీ 
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ

హైదరాబాద్, వెలుగు : అసైన్డ్ భూముల బదలాయింపు (నిరోధక) చట్టానికి సవరణలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్​ ట్రాన్స్ ఫర్-–పీఓటీ) యాక్ట్1977కు సవరణగా తీసుకువచ్చిన యాక్ట్ 12/2018ను సవాల్ చేస్తూ తెలంగాణ రిపబ్లికన్ పార్టీ జనరల్ సెక్రటరీ ఎ.ఆనంద్ దాఖలు చేసిన పిల్ ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. చట్టాన్ని సవరణ చేయడానికి కారణాలు తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ లాయర్ వాదిస్తూ చట్టంలోని సెక్షన్ 4(1)(బి) ప్రకారం అసైన్డ్ భూములను కొనుగోలు చేసినవారికి తిరిగి కేటాయించే గడువును 2007 నుంచి 2017కు ప్రభుత్వం పొడిగించిందన్నారు. దీని ప్రకారం 2017 వరకు అసైన్డ్ భూములను కొనుగోలు చేసినవారికి హక్కులు కల్పించే ప్రయత్నం జరుగుతోందన్నారు. 

ప్రభుత్వ తీరు దారుణం.. 

పేదల జీవనాధారం కోసం ప్రభుత్వ, బంజరు భూములను వ్యవసాయ సాగు నిమిత్తం కేటాయించారని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. ఆ భూములను కొంతమంది పేదలు తక్కువ ధరకే అమ్మేసుకున్నారని, ప్రస్తుత చట్ట సవరణ వల్ల రూ. 50 లక్షల నుంచి రూ. కోటి విలువ చేసే భూములను కేవలం రూ.5 లక్షలకు కొనుగోలు చేసినవారు ప్రయోజనం పొందేలా ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. ఇలాంటి అవకాశం లేకుండా చేయాలని కోరారు. 1977 సెక్షన్ 3 ప్రకారం అసైన్డ్ భూముల బదిలీపై నిషేధం ఉందని గుర్తు చేశారు. అసైన్డ్ భూములను ఇతరులకు కట్టబెట్టే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కోరారు. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను బదలాయించారని తెలిపారు. అయితే, సీఎం కేసీఆర్, తదితరులను పిల్​లో ప్రతివాదులుగా చేర్చడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. వారిని ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్ఏకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.