
- అమెరికాలోని మియామీ నుంచి చిలీ వెళ్తున్న విమానంలో ఘటన
- ఆ సమయంలో ప్లేన్‌లో 271 మంది ప్యాసింజర్లు
మియామీ: విమానం గాల్లో ఉండగా పైలట్ అస్వస్థతకు గురయ్యారు. బాత్రూంకు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. దీంతో కో పైలట్లు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అమెరికాలోని మియామి నుంచి చిలీ వెళ్తున్న ఫ్లైట్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.
టేకాఫ్ అయిన 3 గంటల్లో అస్వస్థత..
271 మంది ప్రయాణికులతో మియామీ నుంచి చిలీలోని శాంటియాగోకు లాటమ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అయింది. 3 గంటల తర్వాత పైలట్ కెప్టెన్ ఇవాన్ అందౌర్(56) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బాత్రూంకు వెళ్లిన ఆయన అక్కడే కిందపడిపోయారు. దీంతో అత్యవసర ట్రీట్మెంట్ అందించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో కో పైలట్లు పనామా ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అప్పటికే కెప్టెన్ ఇవాన్ చనిపోయినట్లు డాక్టర్లు కన్ఫామ్ చేశారు. ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ తీవ్ర సంతాపం తెలిపింది. పైలట్ ఇవాన్ 25 ఏండ్లపాటు తమ సంస్థకు సేవలందించారని, అలాంటి గొప్పవ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందంటూ విచారం వ్యక్తం చేసింది. ప్లేన్‌లో కెప్టెన్‌తో పాటు మరో ఇద్దరు కో పైలట్లు ఉన్నారని, ప్రయాణికులను మరుసటిరోజు తరలించామని ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. అయితే, పైలట్‌ను కాపాడేందుకు కావాల్సినన్ని ఏర్పాట్లు విమానంలో లేవని ఓ నర్సు చెప్పినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.
గుండెపోటుతో ఇండిగో పైలట్ మృతి
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి పుణెకు వెళ్లే ఇండిగో విమానం నడిపేందుకు వెళ్తున్న పైలట్ మనోజ్ సుబ్రమణ్యం(40) గుండెపోటుతో చనిపోయారు. గురువారం బోర్డింగ్ గేటు దగ్గరికి చేరుకోగానే ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చింది. సిబ్బంది అలర్ట్ అయి సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.