కోర్టును బీజేపీ తప్పుదోవ పట్టిస్తున్నది: పైలెట్​ రోహిత్​రెడ్డి

కోర్టును బీజేపీ తప్పుదోవ పట్టిస్తున్నది: పైలెట్​ రోహిత్​రెడ్డి
  •    ఈడీ విచారణలో ఏమీ దొరకలేదు కాబట్టే సీబీఐని దింపుతున్నరు
  •     నన్ను జైల్లో పెట్టినా భయపడ.. అన్నిటికీ సిద్ధంగా ఉన్న
  •     సీబీఐ విచారణే కరెక్ట్​ అని కోర్టు చెప్తే సహకరిస్తానని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తమ అధినేత, సీఎం కేసీఆర్‌‌కు వీడియోలు, ఆడియోలు తానే ఇచ్చానని తాండూరు ఎమ్మెల్యే పైలెట్​ రోహిత్​రెడ్డి చెప్పారు. కోర్టు ఇచ్చిన కాపీలను కూడా  కేసీఆర్‌‌కు అందజేశానని తెలిపారు. న్యాయస్థానాన్ని బీజేపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో ఈడీకి సంబంధం లేకున్నా తనకు నోటీసులు ఇచ్చి విచారించారని, ఈడీ విచారణలో ఏమీ దొరకలేదు కాబట్టే సీబీఐని దింపుతున్నారనే అనుమానం కలుగుతున్నదని అన్నారు.  

దొంగస్వాములు చెప్పినట్టే కేసు విచారణ ముందుకెళ్తున్నదని, ఇది తనకు ఆశ్చర్యం కలిగిస్తున్నదని ఆయన  పేర్కొన్నారు. కేసులో సీబీఐ విచారణే కరెక్ట్​ అని కోర్టు చెప్తే విచారణకు సహకరిస్తానని చెప్పారు. ‘‘నన్ను  జైల్లో పెట్టినా భయపడేది లేదు.  అన్నింటికీ సిద్ధంగానే ఉన్న. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నా లీగల్‌‌ టీం ఒపీనియన్‌‌ తీసుకుంటున్న” అని తెలిపారు. సోమవారం బంజారాహిల్స్‌‌లోని తన ఆఫీస్‌‌లో రోహిత్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాతే తదుపరి కార్యాచరణ ఉంటుందని అన్నారు. సింగిల్‌‌ బెంచ్‌‌ ఆదేశాలపై డివిజన్‌‌ బెంచ్​కు వెళ్లాలా.. సుప్రీంకోర్టుకు వెళ్లాలా అనేది న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బీజేపీ చేతిలో ఈడీ, సీబీఐ, ఐటీ కీలు బొమ్మలని, ఈ విషయాన్ని తాను ఆదివారం నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లోనూ చెప్పానని ఆయన అన్నారు.  

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిట్‌‌ బాగానే విచారిస్తున్నదని, అయినా బీజేపీ నాయకత్వం న్యాయవ్యవస్థలో ఉన్న కొన్ని నిబంధనలను అడ్డుపెట్టుకొని తప్పుదోవ పట్టిస్తున్నదని దుయ్యబట్టారు. ‘‘నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్న. ఈడీ విచారణపై హైకోర్టులో రిట్‌‌ పిటిషన్‌‌ వేసినం. బుధవారం ఈ కేసు విచారణకు వస్తుంది. భవిష్యత్‌‌ కార్యాచరణ ఎలా ఉంటుందనేది ఆరోజే వెల్లడిస్త” అని పేర్కొన్నారు. కేసుతో సంబంధం లేనివాళ్లను విచారించడంపై రిట్‌‌ పిటిషన్‌‌ వేశామనే సమాచారాన్ని ఈడీకి ఇస్తామని ఆయన తెలిపారు.