
- మొదట రాలేనంటూ సమాచారం.. రావాల్సిందేనన్న ఈడీ.. ఎట్టకేలకు హాజరు
- అంతకు ముందు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ
హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు వచ్చే ముందు పెద్ద హైడ్రామా నడిచింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరు కావాలని ముందుగా ఈడీ ఆయనకు సమన్లు పంపింది. అందులో పేర్కొన్న విధంగా రోహిత్.. ఈడీ ఆఫీస్‌కు వెళ్లలేదు. ఆయన ఉదయం 10 గంటలకు మణికొండలోని తన ఇంటి నుంచి బయలుదేరి నేరుగా సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లారు. ప్రగతి భవన్‌లో సుమారు రెండు గంటల పాటు సీఎంతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే విచారణకు హాజరుకాలేనని తన పర్సనల్ అసిస్టెంట్‌తో ఈడీకి లెటర్ పంపించారు. వ్యక్తిగత కారణాలు, అయ్యప్ప మాలలో ఉన్నందున ఈ నెల 25 తరువాత విచారణకు వస్తానని తెలిపినట్లు సమాచారం. అయితే ఆయన పంపిన రిక్వెస్ట్ లెటర్‌ను ఈడీ అధికాలు రిజెక్ట్ చేశారు. షెడ్యూల్ ప్రకారం రావాల్సిందేనని ఈడీ ఆదేశించడంతో విచారణకు ఎమ్మెల్యే హాజరయ్యారు.
సీఎంతో భేటీ అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఫిల్మ్‌నగర్‌లోని అయ్యప్ప గుడిలో రోహిత్ రెడ్డి భిక్షకు వెళ్లారు. అక్కడి నుంచి 3.30 గంటలకు నేరుగా ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. తర్వాత ఆయనను అధికారులు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. కాగా, విచారణకు హాజరయ్యే ముందు మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేనని, కొంత సమయం ఇవ్వాలని ఈడీ అధికారులను కోరానని తెలిపారు. సమయం ఇవ్వకపోవడంతో విచారణకు వచ్చానని చెప్పారు. ఈడీ అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. విచారణకు హాజరైతేనే కేసు ఏమిటనే వివరాలు తెలుస్తాయన్నారు. ఎలాంటి వివరాలు అడిగినా తెలిసినవి చెబుతానని వెల్లడించారు. ఆడిటర్, అడ్వొకేట్ లేకుండానే ఈడీ అధికారుల ముందు అటెండ్ అయ్యారు. ‘‘నా రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేయడంతో విచారణకు వచ్చాను. ఏ కేసులో పిలిచారో, ఎందుకు పిలిచారో ఈడీ అధికారులు చెప్పలేదు. ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఎంత మంది ఆఫీసర్లు వచ్చి అడిగినా వారికి సమాధానాలు ఇచ్చాను. వ్యక్తిగత వివరాలు, కుటుంబీకుల వివరాలతో నా పూర్తి బయోడేటా తీసుకున్నారు. ఆధార్, పాన్‌కార్డు అందించాను. ఈడీ ఫార్మాట్‌లో ఉన్న అన్ని వివరాలు ఇచ్చాను. కేసులకు కానీ, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్‌కి సంబంధించిన వివరాలు కానీ అడగలేదు. మంగళవారం మళ్లీ ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని అధికారులు ఆదేశించారు’’ అని రోహిత్ రెడ్డి వెల్లడించారు.