కాళేశ్వరం కాల్వకు భూములివ్వం .. గ్రామసభను బహిష్కరించిన పిలుట్ల రైతులు

కాళేశ్వరం కాల్వకు భూములివ్వం .. గ్రామసభను బహిష్కరించిన పిలుట్ల రైతులు

శివ్వంపేట, వెలుగు: కాళేశ్వరం కాల్వ నిర్మాణానికి తాము భూములివ్వమని పిలుట్ల గ్రామ రైతులు తేల్చి చెప్పారు. గ్రామసభను బహిష్కరించడంతో చేసేదేమి లేక అధికారులు వెనుదిరిగారు. కొండపోచమ్మ సాగర్​ నుంచి సింగూర్​ ప్రాజక్ట్​కు నీటిని తరలించేందుకు నిర్మించ తలపెట్టిన సంగారెడ్డి కెనాల్​ నిర్మాణంలో మెదక్  జిల్లా శివ్వంపేట మండలం పిలుట్ల గ్రామంలో 80 ఎకరాల భూములను రైతులు కోల్పోతున్నారు. వీరితో మాట్లాడేందుకు తహసీల్దార్​ శ్రీనివాస్​చారి, ఆర్ఐ కిషన్, కాళేశ్వరం ప్రాజెక్ట్​ డీఈ కవిత, ఏఈ శ్రీనివాస్  శుక్రవారం గ్రామసభ ఏర్పాటు చేశారు.

కాగా రైతులు కాళేశ్వరం కాల్వ తమకు వద్దని, ప్రాణాలు పోయినా సరే భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పి, గ్రామసభను బహిష్కరించారు.  అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. విషయం తెలిసి సమీప గ్రామాలైన నర్సాపూర్ మండలం లింగాపూర్, చిన్న చింతకుంట, బ్రాహ్మణపల్లి గ్రామ రైతులు కూడా పిలుట్ల గ్రామానికి చేరుకొని కాలువకు ఎట్టిపరిస్థితుల్లోనూ భూములు ఇవ్వబోమన్నారు. అధికారులు రైతులకు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో చేసేది లేక వెనుదిరిగారు. అనంతరం అధికారులు లింగోజిగూడలో నాలుగు ఎకరాల భూమి కోల్పోతున్న రైతులతో గ్రామసభ నిర్వహించారు. 

పోలీసులకు ఫిర్యాదు..

పిలుట్లలో గ్రామసభ నిర్వహిస్తుండగా లింగాపూర్, చిన్న చింతకుంట, బ్రాహ్మణపల్లికి చెందిన 12 మంది ఆఫీసర్లతో దురుసుగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు శివ్వంపేట తహసీల్దార్​ శ్రీనివాస్ చారి తెలిపారు. విచారణ జరిపి కేసు నమోదు చేయాలని కోరినట్లు చెప్పారు.