- ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, వెలుగు : వరద బాధితులకు అండగా ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం మణుగూరు మండలంలో వరద బాధితులకు ఆర్థిక సహకార చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలో 2030 కుటుంబాలకు రూ. 16,500 చొప్పున పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన బాధితులకు వెంటనే పరిహారం అందించామని, గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని గొప్ప కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.
పంట నష్టపోయిన రైతులకు నివేదికల అనంతరం పూర్తిస్థాయి పరిహారాన్ని అందజేస్తామన్నారు. అధికారులు అందించిన ఎస్టిమేషన్ల ప్రకారం నిధులు మంజూరు అవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ లీడర్లు పీరినాకి నవీన్, గణేశ్రెడ్డి, కూచిపూడి బాబు, సామ శ్రీనివాస్ రెడ్డి, పాతూరి వెంకన్న పాల్గొన్నారు.