
- ఎమ్మెల్యే రాగమయిని వేడుకున్న పినపాక ప్రజలు
తల్లాడ వెలుగు: తమకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, సరైన వసతి లేక ఒక్కో కుటుంబంలో రెండు, మూడు జంటలు ఇబ్బందులు పడుతున్నామని తల్లాడ మండలం పినపాక ప్రజలు ఎమ్మెల్యే మట్టా రాగమయిని కోరారు. స్థలం ఇప్పిస్తే రేకుల షెడ్డు వేసుకొని ఉంటామని విన్నవించారు. బుధవారం సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి పినపాక గ్రామంలోని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించేందుకు కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తో కలిసి స్థల పరిశీలన చేశారు.
అక్కడికి వచ్చిన గ్రామస్తులు ఎలాగైనా తమకు ఇండ్ల స్థలాలు ఇప్పించాలని ఎమ్మెల్యేను వేడుకున్నారు. ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలకు తప్పకుండా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేశ్‌బాబు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మట్టా దయానంద్, మండల అధ్యక్షుడు కాపా సుధాకర్, నాయకులు రాయల రాము, గుర్రం శీను, యూత్ కాంగ్రెస్ నాయకుడు కటికి కిరణ్, గొడుగునూరి లక్ష్మిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.