రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ‘ప్రేయసి రావే’ ఫేమ్ మహేష్ చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం ‘పిఠాపురంలో’. అలా మొదలైంది అనేది క్యాప్షన్. పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణి చందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి నిర్మించారు. శుక్రవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ‘ప్రేయసి రావే’లో నటించిన హీరో శ్రీకాంత్, పృథ్వీ, శివాజీ రాజా, ఎంఎం శ్రీలేఖ ముఖ్య అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు.
దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ ‘ప్రతీ ఇంట్లో జరిగే సంఘటనలతో దీన్ని తెరకెక్కించాం. సినిమాని చూస్తే ఇది మా ఇంట్లోనే జరిగినట్టు ఉందే అని ఫీల్ అవుతారు. ఇప్పటివరకు మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ క్లైమాక్స్‌కి ఎమోషనల్ అయ్యారు. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. అలాగే ‘ప్రేయసి రావే 2’ స్టోరీ రెడీ చేశా’ అని అన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇదని నిర్మాతలు తెలిపారు. నటీనటులు పృథ్వీ, విరాట్, ప్రత్యూష, గీత, శ్రీలు, ప్రేమ్, దాసరి పద్మ, డైలాగ్ రైటర్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
