
పిట్లం, వెలుగు: పిట్లంలో సహకార సంఘం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం పాలకవర్గం ఫిబ్రవరిలో ముగియనుండగా.. ప్రభుత్వం ఆరు నెలల గడువు పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సారైనా పిట్లంను చిల్లర్గి నుంచి వేరుగా ప్రత్యేక సంఘం ఏర్పాటు చేయాలని ఇక్కడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే పిట్లం సొసైటీ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
అవగాహన లోపంతోనే ..
పిట్లం సహకార సంఘం ఒకప్పుడు మండలంలో అత్యధికంగా లావాదేవీలు నిర్వహించి మంచి సంఘంగా గుర్తింపు తెచ్చుకుంది. 2005లో ప్రభుత్వం ప్రతి మండలంలో నష్టాల్లో ఉన్న సంఘాలను రద్దు చేసి వాటి స్థానంలో ఒకటి లేదా రెండు సొసైటీలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. పిట్లం మండలంలో పిట్లం, చిన్నకొడప్గల్,చిల్లర్గి, బండాపల్లి, తిమ్మానగర్, కారేగాంలో సహకార సంఘాలు ఉండగా అందులో చిన్నకొడప్గల్, కారేగాం సంఘాలు లాభాల్లో ఉండగా మిగిలిన నాలుగు సంఘాలు నష్టాల్లో ఉన్నట్లు గుర్తించారు. నాలుగింటిని తొలగించి ఒక్క దాన్ని పిట్లంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ కారణంగా బండాపల్లి, చిల్లర్గి, తిమ్మానగర్‌లు సంఘాలు రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. మరో సంఘం ఏర్పాటుకు అవకాశం ఉండటంతో తిమ్మానగర్ నాయకులు జిల్లా స్థాయి నాయకులతో పైరవీలు చేసి తమ సంఘం కొనసాగించేలా చూశారు. చిల్గర్గి పరిధి నాయకులు పైరవీ చేసి చిల్లర్గి సొసైటీ అక్కడే ఉండేలా చేసుకున్నారు. మండలంలో తొలగించిన సొసైటీల స్థానంలో రెండుకు మించి సొసైటీలు ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో పిట్లం సొసైటీని గత్యంతరం లేక చిల్లర్గిలో విలీనం చేశారు. మండల కేంద్రంలో ఉన్న పిట్లం సొసైటీ పోదనే నమ్మకంతో అవగాహన లేని పిట్లం నాయకులు చిల్లర్గి, తిమ్మానగర్ సొసైటీల కోసం పైరవీలో పాలు పంచుకోవడంతో మండల కేంద్రంలో సొసైటీ లేకుండా పోయింది.
ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు సొసైటీల వారీగా విడుదల చేస్తుండడంతో చిన్న సొసైటీల మాదిరిగానే చిల్లర్గి సొసైటీకి విడుదల అవుతున్నాయి. ఎక్కువ మంది సభ్యులు ఉన్న చిల్లర్గి సొసైటీ రైతులు నష్టపోతున్నారు. చిల్లర్గిలో పిట్లం, బండాపల్లి విలీనం కావడంతో ప్రస్తుతం చిల్లర్గి సొసైటీలో 23 పంచాయతీలు ఉండగా ఇందులో 4892 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో పెద్ద సొసైటీగా ఉన్న చిల్గర్గి నుంచి పిట్లం సొసైటినీ విడగొట్టి పిట్లం సంఘాన్ని పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. ఇటీవల పిట్లం వచ్చిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు పిట్లం సొసైటీని పునరుద్ధరించాలని వినతిపత్రం అందజేశారు.