
- నాలుగేండ్ల బీఎస్సీ వ్యవసాయ డిగ్రీ కోర్సు ప్రారంభం
- వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు
గండిపేట్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ సిడ్నీ వర్సిటీ(డబ్ల్యూఎస్ యూ)లో కలిసి నాలుగేండ్ల బీఎస్సీ వ్యవసాయ డిగ్రీ కోర్సును ప్రారంభించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అందుబాటులోకి తేనుంది. వ్యవసాయ వర్సిటీలో రెగ్యులర్ గా ఉన్న బీఎస్సీ (అగ్రికల్చర్), కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సులకి అదనంగా దీన్ని అందించనుంది. ఇందులో మూడేండ్లు పీజేటీఏయూలోనూ, ఏడాది వెస్టర్న్ సిడ్నీ వర్సిటీలో చదివే అవకాశం ఉంటుందని వర్సిటీ అధికారులు తెలిపారు. ఎంఎస్సీ చదవాలని భావిస్తే మరో ఏడాది వెస్టర్న్ సిడ్నీ వర్సిటీలో చదవొచ్చని చెప్పారు.
దీనివల్ల బీఎస్సీ డిగ్రీ పీజేటీఏయూ నుంచి, ఎంఎస్సీ డిగ్రీ వెస్టర్న్ సిడ్ని వర్సిటీ నుంచి పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఎవరైనా స్టూడెంట్స్పీజీ తర్వాత కూడా వెస్టర్న్ సిడ్నీ వర్సిటీలో పీహెచ్ డీ కూడా చేయదల్చుకుంటే ఎటువంటి రుసుము లేకుండా స్కాలర్ షిప్ సాయంతో పూర్తి చేయొచ్చన్నారు. ఈ అంశాలపై రెండు వర్సిటీల మధ్య ఒప్పందం కుదిరే ప్రక్రియ తుది దశలో ఉందని పీజీటీఏయూ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వివరించారు. వెస్టర్న్ సిడ్నీ వర్సిటీ అందించే అన్ని వ్యవసాయ కోర్సులకి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) గుర్తింపు ఉందని వెల్లడించారు. ఈ మేరకు ఐసీఏఆర్, డబ్ల్యూఎస్ యూల మధ్య గతేడాది ఒప్పందం కూడా కుదిరిందన్నారు. ఈ ప్రత్యేక కోర్సుల ప్రవేశాల కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు జానయ్య పేర్కొన్నారు.