క్రీడా ప్రాంగణాలకు జాగలు కరువు

క్రీడా ప్రాంగణాలకు జాగలు కరువు
  • గ్రామాల్లో సర్కారు స్థలాలు లేక ఇబ్బంది 
  • చాలాచోట్ల అసైన్డ్​, శిఖం భూముల గుర్తింపు  
  • రేపు ప్రారంభించాలని ప్రభుత్వ ఆదేశాలు 
  • రూ.4 లక్షల ఉపాధి నిధులతో పనులు 
  • ఇంత వరకు ఒక్కటి కూడా పూర్తికాలే

ఆదిలాబాద్/మంచిర్యాల,వెలుగు : గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రతీ గ్రామంలో ఆటస్థలాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. క్రీడాపోటీల నిర్వహణతో పాటు శిక్షణకు అనువుగా ఎకరం స్థలంలో ప్లే గ్రౌండ్స్​ను అభివృద్ధి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఉపాధి హామీ పథకం కింద ఎకరం స్థలంలో రూ. 4 లక్షలు వెచ్చించి ఆటస్థలానికి సంబంధించిన పనులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా గ్రామాల్లో స్థల సేకరణలో అధికారులు బిజీ అయ్యారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ కోర్టులు, లాంగ్​జంప్ వంటివి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే చాలా గ్రామాల్లో ఎకర స్థలం కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోవడంతో అన్ని హ్యాబిటేషన్లలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చంటున్నారు. 

అసైన్డ్, శిఖం భూములపై ఆందోళన... 

చాలా చోట్ల గవర్నమెంట్​ల్యాండ్స్​లేకపోవడం సమస్యగా మారింది. దీంతో దిక్కుతోచని ఆఫీసర్లు ఎప్పటిలాగే చెరువు శిఖం భూములు, రాళ్లురప్పలతో ఎందుకూ పనికిరాని భూములను గుర్తించారు. వివాదాల్లో ఉన్న పట్టా భూములతో పాటు గతంలో పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్​ ల్యాండ్స్​ను గుర్తించి ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కాసిపేటలో ఎస్సీలకు గ్రామ శివారులోని సర్వేనంబర్​ 98లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసి ఇండ్ల స్థలాలు ఇచ్చారు. తాజాగా అక్కడ తెలంగాణ క్రీడా మైదానం ఏర్పాటుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఇటీవల గ్రీవెన్స్ సెల్​లో కలెక్టర్​కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా లక్సెట్టిపేట మండలం దౌడేపల్లిలో క్రీడాప్రాంగణం కోసం చెరువు శిఖం భూమిని గుర్తించి ప్రపోజల్స్ పంపారు. దీంతో చేపలు పట్టుకొని బతుకుతున్న మత్స్యకారులు తాము ఉపాధి కోల్పోతామని ఆందోళనకు దిగారు. ఎట్టకేలకు స్పందించిన ఆఫీసర్లు స్థానిక గవర్నమెంట్​ స్కూల్​ఆవరణలో ఉన్న స్థలంలో ప్లే గ్రౌండ్​ఏర్పాటు చేస్తున్నారు. 

ఒక్కటీ పూర్తి కాలే...  

ఆదిలాబాద్ జిల్లాలోని 17 మండలాల్లో 468 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికే అధికారులు స్థల సేకరణ కోసం గ్రామాల బాటపట్టారు. క్రీడా ప్రాంగణాలకు అనువైన స్థలాలే కాదు.. అసలు ఎకరం స్థలం కూడా దొరకని గ్రామాలు సగం వరకు ఉన్నాయి. గతంలో డబుల్ బెడ్ రూమ్​లు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులకు స్థలాలు దొరకక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటికీ చాలా చోట్ల స్థలాలు లేకపోవడంతోనే డబుల్ బెడ్ రూంలు మంజూరు చేయడం లేదు. ఇప్పుడు ప్రతీ గ్రామంలో ఎకరం స్థలం సేకరించేందుకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పైగా క్రీడా మైదానాలు గ్రామాలకు ఆనుకొని ఏర్పాటు చేయాలనే నిబంధనలు ఉండడంతో మరింత సమస్య ఎదురవుతోంది. ఇప్పటివరకు గ్రామాల్లో రైతువేదికలను స్థలం లేకపోవడంతోనే ఊరికి దూరంగా నిర్మించారు. ఎకరం స్థలం దొరకని హ్యాబిటేషన్లలో ఎకరానికి అటు ఇటుగా ఐదు, పది గుంటలు తక్కువగా ఉన్నా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లాలో 548 గ్రామాలకు గాను 393 హ్యాబిటేషన్లలో స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపారు. ఇందులో కేవలం 38 చోట్ల మాత్రమే క్రీడా మైదానాలను గ్రౌండింగ్​చేశారు. మరో 155 గ్రామాల్లో స్థలాలు లేక ఆఫీసర్లు ఇబ్బందులు పడుతున్నారు. 

రేపు ప్రారంభం..

ఆదిలాబాద్​ జిల్లాలో 32 గ్రామాల్లో, మంచిర్యాల జిల్లాలో 38 గ్రామాల్లో మాత్రమే ఇప్పటి వరకు స్థల సేకరణ పూర్తి చేశారు. ఈ స్థలాలను ఆఫీసర్లు చదును చేసే పనిలో ఉన్నారు.  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొదటి విడతగా ఈనెల 2న ప్రతీ మండలంలో రెండు క్రీడా ప్రాంగణాలు ప్రారంభించాలని పంచాయతీరాజ్ రూరల్ డెవలప్​మెంట్​ కమిషనర్ నుంచి కలెక్టర్లు, డీఆర్డీవోలకు ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇప్పటివరకు గుర్తించిన గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు పూర్తి చేస్తామని అధికారుల చెబుతున్నారు. సేకరించిన స్థలంలో క్రీడా ప్రాంగణంతో పాటు స్థలం చుట్టూ కానుగ, గుల్​మోహర్, నిమ్మ, చింత తదితర మొక్కలు నాటాలని నిబంధనల్లో తెలిపారు.  

32 చోట్ల పనులు స్టార్ట్ చేసినం 

క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కోసం స్థల సేకరణ జరుగుతోంది. ఇప్పటివరకు 32 చోట్ల స్థల సేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించాం. ఈనెల 2 నాటికి వీటిని పూర్తిచేస్తాం. ఉపాధిహామీ నిధులు ఒక్కో క్రీడా ప్రాంగణానికి రూ .4 లక్షలు వెచ్చించి పనులు చేపడుతున్నాం. ఎకరం స్థలం లేని చోట కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ పనులు చేసేందుకు రెడీగా ఉన్నాం.

- కిషన్, డీఆర్డీవో, ఆదిలాబాద్